
కరోనా మహమ్మారి బారి నుంచి జనాలను రక్షించడానికి దేశవ్యాప్తంగా సోనూ సూద్ చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తున్నారు సోనూ. ఏపీలో కూడా ఓ ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు.. కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కూడా అందించాడు. తన ఇద్దరు పిల్లలను కాడెడ్లుగా పెట్టి భూమి దున్నుతున్న వారి కష్టం చూడలేక ఈ సహాయం చేశాడు సోనూ.
అయితే.. దీనిపై అప్పట్లోనే వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్నర్ చేసేందుకు ప్రయత్నించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన రైతు కాదని నిరూపించే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు మరోసారి సోనూ సూద్ ను టార్గెట్ చేశారనే ప్రచారం సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబును సోనూ సూద్ మెచ్చుకోవడమేనని అంటున్నారు.
ఇటీవల నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు, సోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూ చేస్తున్న సేవను చంద్రబాబు అభినందించారు. నమస్కారానికి ప్రతినమస్కారం అన్నట్టుగా.. సోనూ కూడా చంద్రబాబు గురించి రెండు గొప్ప మాటలు చెప్పారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీమ్.. చంద్రబాబును సోనూ మెచ్చుకున్నారహో.. అంటూ పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది.
దీంతో.. సోనూపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఆయనకు ఒక సామాజిక వర్గాన్ని కూడా తగిలించారని టాక్. సోనూ సేవలను అనుమానిస్తూ.. అవమానించేందుకు ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నించారు. అయితే.. అవన్నీ పట్టించుకోని సోనూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఇలాంటి సమయంలో వైసీపీ శ్రేణులు సోనూను టార్గెట్ చేశారంటూ వార్తలు రావడం అవాంఛనీయం. తాను తెలుగుఇంటి అల్లుడినని తరచూ చెబుతుంటాడు సోనూ. తెలుగు వాళ్లకు కూడా అతను ఎన్నో విధాలుగా సహాయం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సేవలు పొందినవారు ఉన్నారు. అలాంటి వ్యక్తిపై చిల్లర రాజకీయాలు చేయడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.