Chandrababu: ₹1 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మద్యపాన నిషేధం.. వీటి పేరు చెప్తే కచ్చితంగా ఎన్టి రామారావు గుర్తుకొస్తారు. ఉచిత విద్యుత్, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి స్ఫురణ కు వస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి మదిలో మెదులుతారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రస్తావన వస్తే కచ్చితంగా కెసిఆర్ కళ్ళ ముందు కనిపిస్తారు. ఇది పథకాలు మాత్రమే కావు.. చాలామంది జీవితాల్లో మార్చేసిన గొప్ప నిర్ణయాలు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించింది కాబట్టి.. ఓటర్లు ఆ పార్టీకి జై కొట్టారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో పెట్టింది.. అంటే ఇలా ఒక్కో పార్టీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొచ్చింది.. ఎవరు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా అంతిమంగా అది రాష్ట్ర ఖజానా పైనే ప్రభావం చూపిస్తుంది. సరే ఆ సంగతి పక్కన పెడితే.. కొన్ని పథకాల విషయంలో నాయకులు చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ కొంత మంది నాయకులు మాత్రం పథకాలు ప్రవేశ పెట్టకపోయినప్పటికీ ఆ ఘనత తమదే అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన సెల్ఫ్ డబ్బా ఏమిటో మీరే చదివేయండి..
నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సీఎం గా పని చేశారు. ఐటీ ని నేనే కనిపెట్టా అని చెప్పుకునే ఈయన.. వ్యవసాయం దండగ అని అప్పట్లో అన్నారు. అంతేకాదు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని తెరపైకి తీసుకొస్తే అది వృధా ప్రయత్నం అని కొట్టి పారేశారు. అంతేకాదు ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ అలాంటి వ్యక్తి ఎన్నికల్లో గెలిచేందుకు ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అంతేకాదు సంక్షేమ పథకాలు అమలు చేయడం సరికాదని పలుమార్లు చెప్పిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో అడ్డగోలుగా అమలు చేశారు. నీరు_ చెట్టు, పసుపు_ కుంకుమ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు టిడిపి నాయకుల కడుపులు నింపాయి. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని దూరం చేశాయి.. ఈ క్రమంలో అప్పట్లో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయన పథకాలను అమలు చేయడం మొదలుపెట్టారు. అయితే వీటి అమలుకు సంబంధించి ఆరోపణలు లేకపోలేదు. సొంత పార్టీ నాయకులకే ఆ పథకాలు దక్కుతున్నాయని విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆ పథకాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించడంతో వారందరికీ ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోరని ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు కాకముందే సిక్సర్ పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు.. అయితే ఈ పథకాలన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నవే.
సిక్సర్ పేరుతో చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చిన పథకాలన్నీ ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలవుతోంది. అయితే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు తన మానస పుత్రికగా అభివర్ణించుకుంటుండడం విశేషం. ఇక రైతులకు ఉచిత విద్యుత్తు, మహిళలకు పింఛన్లు, చదువుకునే పిల్లలకు ఉపకార వేతనం, ఇంకా పలు రకాల పథకాలను చంద్రబాబు నాయుడు తన సిక్సర్ లో పొందుపరిచారు. అయితే ఈ పథకాలు ఆల్రెడీ ఆయన సొంత రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అలాంటప్పుడు ఆ పథకాలపై ఆయన ముద్ర ఏమిటనేది ఒకింత సందేహాస్పదమే.. పైగా ఈ పథకాలను తాను మాత్రమే కొత్తగా అమలు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ పథకాల అమలుకు సంబంధించి చంద్రబాబునాయుడు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబునాయుడు కి మతిమరుపు వస్తోందని వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ మంత్రాన్ని పఠించడంలో తప్పు లేదని.. కానీ జగన్ అమలు చేస్తున్న పథకాలకు పేరు మార్చి అది తన ఘనతని చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు.
— Vikatakavi (@vikatakavi1231) December 26, 2023