YCP Govt- Corporations: మింగ మెతుకు లేదు..మీసానికి సంపంగి నూనె అన్నట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహార శైలి. నవరత్నాలు తప్ప ఏ ఇతర పథకాలకు, ప్రాజెక్టులకు, చివరాఖరుకు మౌలిక వసతులకు నిధులు సమకూర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మూడున్నరేళ్లుగా రహదారులు పాడయ్యాయి మహా ప్రభో అంటూ విపక్షాలు మొత్తుకున్నా.. ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నా పట్టించుకోలేదు. అటు గడపగడపకూ వెతుక్కొని వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ప్రతిఘటనలు తప్పడం లేదు. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజాగ్రహం పెరిగిపోతోంది. దానికి విరుగుడుగా అభివృద్ధి చేసి చూపించాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజలను దారిన తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడున్నరేళ్లుగా అచేతనంగా ఉన్న కార్పొరేషన్లకు ఇప్పుడు రూ.2 లక్షల నిధులు సమకూర్చుతోంది. అదేదో ప్రజల బాగోగుల కోసం కాదు. ఆ కుల సంఘాల్లో యాక్టివ్ గా ఉన్నవారికి సన్మానాలు, సత్కారాల కోసం. అదే సొమ్ముతో విందూ వినోదాలు ఏర్పాటుచేయాలని కూడా సూచించడం విస్తుగొల్పుతోంది.

ఏపీలో కులాలకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదు. గత ఎన్నికల్లో కులాల మధ్య కుంపట్లు రగిల్చి జగన్ పొలిటికల్ గా గెయిన్ అయ్యారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిపై పట్టు పెంచుకునేందుకు కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు, సంక్షేమ ఫలాలు దక్కించుకొని సామాజికవర్గాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్ అన్న మీనింగే మారిపోయింది. సామాజికవర్గాల మాట దేవుడెరుగు.. కానీ వైసీపీ అధికారంలోకి రావడానికి కృషిచేసిన ఆయా సామాజికవర్గ నాయకులకు, రాజకీయ నిరుద్యోగులకు కార్పొరేషన్లు సృష్టించి మరీ పదవులు కట్టబెట్టారు. పదవులు వరకూ ఒకే కానీ ఈ కార్పొరేషన్లకు నిధులు, విధులు ఉండవు. నెలనెలా జీతాలు, ఆపై వాహన భృతితో పాటు ఇతరత్రా సదుపాయాలు దక్కుతాయి. అయితే విధుల విషయానికి వచ్చేసరికి ఏ పనీ ఉండదు. నిధులు అంటే నవరత్నాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలను కులాల వారీగా లెక్కకట్టి .. ఈ కార్పొరేషన్ కు ఇంత కేటాయించామని చెబుతున్నారు. అంతకు మించి పని ఉండదు… పనితనం కనబరచనక్కర్లేదు.
అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం కార్పొరేషన్ .పాలకవర్గాలకు దండిగా పనిచెప్పేందుకు సిద్ధమైంది. ఒక్కో కార్పొరేషన్ కు రూ.2 లక్షల చొప్పున కేటాయించనున్నట్టు చెబుతోంది. ఇటీవల బీసీ కార్పొరేషన్ మంత్రి చెల్లుబోయిన గోపాలక్రిష్ణ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పదవులు దక్కించుకున్న వారితో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. ఎన్నికలు వస్తున్నాయి కదా.. మీతో అసలు పని వచ్చిందంటూ ప్రసంగం ప్రారంభించారు. కుల పెద్దలు, బీసీ సంఘాల నాయకులను పిలిచి సన్మనాలు చేయమన్నారు. అంతే కాదు… సామాజికవర్గాల్లో పరపతి ఉన్న నాయకులను ప్రసన్నంచేసుకునే బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రభుత్వానికి అడ్డదిడ్డంగా మాట్లాడే నాయకులకు విందులు, వినోదాలు ఏర్పాటుచేసి నోరు మూయించాలన్న టాస్క్ కూడా ఇచ్చారు. కార్పొరేషన్ కు రూ.2 లక్షలు ఇస్తామని..వాటని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని మంత్రి పురమాయించినట్టుగా తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ వర్గాలు దారుణంగా చికితిపోయాయి, వారికి అందాల్సిన రుణాలు, రాయితీలు, స్వయం ఉపాధి పథకాలన్నీ నవరత్నాల లెక్కలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వ నిర్వాకంతో స్వయం ఉపాధి పథకాలు నిలిచిపోగా.. కులవృత్తులు కూడా నిర్వీర్యమయ్యాయి. గత ప్రభుత్వం అందించిన ఆదరణ యూనిట్లను సైతం వైసీపీ సర్కారు నిలిపివేసింది. ఎటుచూసినా బీసీ వర్గాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అంతా బాగుంది. సవ్యంగా సాగుతుందని కుల సంఘాల నేతలతో ప్రకటనలు ఇప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని విందులకు, వినోదాలకు కేటాయించేందుకు సిద్ధపడుతోంది. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే నిధులు లేక నామినేట్ అయిన వారు ఆకలితో ఉన్నారు. ఒక్కో కార్పొరేషన్ కు చైర్మన్; ఉపాధ్యక్షుడు, ఇతర సభ్యులతో కలిపి పది మంది వరకూ ఉంటారు. విందులు, వినోదాలని కులపెద్దలతో కలుపుకుంటే కనీసం 100 మందికి భోజనాలు పెట్టాలంటే ఈ మొత్తం ఏ మూలకూ చాలదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ప్రయాస పడుతున్నా ఈ విందూ వినోదాల మార్గం వర్కవుట్ అయ్యే పరిస్థితులు మాత్రం లేవు. కానీ కోట్లాది రూపాయల ప్రజాధనం మాత్రం ఇట్టే ఖర్చయిపోవడం ఖాయం.