
YCP : ప్రజల్లో ఆదరణ తగ్గలేదని వైసీపీ నిరూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పూర్తి కాలం పరిపాలన చేస్తామని అన్న మాటపై కట్టుబడే పరిస్థితులు ప్రస్తుతం లేవని జగన్ నమ్ముతున్నట్లున్నారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా ప్రకటనలు చేస్తున్నారు. సర్వేలు కూడా రాబోవు ఎన్నికల్లో వైసీపీదే గెలుపని కరాఖండిగా చెప్పేస్తుండటంపై ముందస్తు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండాలని నాయకులకు దిశా నిర్దేశం చేసి వైసీపీ అధిష్టానం రాష్ట్రాన్ని ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది.
వైసీపీ ప్రజా ప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ స్టిక్కర్లను ఇంటింటికి తగిలిస్తున్నారు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ తీసుకొని ఓ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వమని సూచిస్తున్నారు. ఎందుకొచ్చిన గోల అని అందుకు ఓకే అనేస్తున్నారు. దాంతో ఎక్కువ మంది ఈటీజీ సర్వేలో పాల్గొంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దానినే ప్రముఖంగా చూపుతున్నారు. మరోవైపు టైమ్స్ నౌ వంటి జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో సర్వే చేసి రాబోయేది వైసీపీనేనని ప్రకటించేసింది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఖాయమని అంది. అయితే, ఆ సంస్థలు ఏ విధంగా ఎవరిని ప్రశ్నలు అడిగి నిర్థారణ చేశారో ప్రకటించలేదు. ఓ కాకి లెక్కలను మాత్రం విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వచ్చిన నాలుగేళ్లలో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసింది. ఇంకా కావాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉంది. రాష్ట్ర ఫోన్ కాల్స్ కు కేంద్ర అధికారులు స్పందించడం లేదనే పుకార్లు ఉన్నాయి. ఛీ అన్నా, అప్పు ఇచ్చేది కేంద్రమే కాబట్టి ఏ విధమైన సిగ్గు లేకుండా మరలా ప్రాధేయపడటం పరిపాటిగా మారింది. మరోవైపు అయినవాళ్లు కేసుల్లో ఇరుక్కొని పార్టీని అప్రదిష్టపాల్జేశారు. ఇంతకు ముందులా కేంద్రం నుంచి తగినంత సహకారం అందడం లేదు. ఈ పరిస్థితుల్లో గెలిచేది మనమే, మొత్తం 25 ఎంపీలు బుట్టలో పడనున్నాయని ప్రకటనలు వస్తే కేంద్రం మనసు మారుతుందనే ఆలోచన ఉండవచ్చని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
విశాఖ విషయంలో జగన్ కామెంట్లు చేస్తున్నారు. పరిపాలన రాజధాని అని ప్రకటించారు. పలు ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయని అన్నారు. వైసీపీతోనే అభివృద్ది సాధ్యమనే సంకేతాలను పంపుతున్నారు. కోర్టులో ఉన్న అమరావతి అంశంపైనా తమకు సానుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నారు. ఆ విధంగా సెంటిమెంట్ పెంచుకుంటున్నారు. ముందు ముందు అన్ని ప్రాంతాల విషయంలో అభివృద్ధి అనే అంశంపై మరిన్ని ప్రకటనలు వస్తాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పెద్దగా స్పందించడం లేదు. అప్పులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. ముందుస్తుకు వెళ్తే కేంద్రం సహకారం అందిస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
ఆ మేరకు తెలంగాణాతో పాటు ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.