
అధికారం మారితే.. అంతా మారిపోతుంటుంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. టీడీపీ హయాంలో ప్రకృతి వనరులైన మైనింగ్ వ్యాపారంలో కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ అలా చేద్దామంటే కుదురుతుందా? అస్సలు కుదరదు.. అధికారంతోపాటే హక్కులు వైసీపీకే చెందుతాయి. అందుకే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అయితే వైసీపీలో చేరి ఆస్తులు కాపాడుకోవాలి.. లేదంటే చేరకుండా ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డునపడాలి.. ఇప్పుడు ఇదే ఆప్షన్ ను వైసీపీ.. టీడీపీ ఎమ్మెల్యేలు.. నేతలకు ఇస్తోంది.. ‘వైసీపీలో చేరుతారా? చస్తారా’ అంటూ కుండబద్దలు కొడుతోంది.
Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?
నిజానికి వైసీపీలోకి చేరడానికి ఇష్టం లేక బీజేపీలో చేరితే వైసీపీ టచ్ చేయదు అని కొందరు ఆ బాట పడుతున్నారు. కానీ బీజేపీలో చేరే టీడీపీ నేతలను వైసీపీ వదలిపెట్టకుండా వెంటాడుతుండడం కొసమెరుపు.
ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గ్రానైట్ లీజులను ప్రభుత్వం రద్దు చేసి పచ్చపార్టీ నేతలందరికీ ఓ గట్టి షాకిచ్చింది. నిజానికి ఎమ్మెల్యే గొట్టిపాటి, పోతులను వైసీపీలో చేరాలని ఆ పార్టీ ఒత్తిడి తెచ్చింది. చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగాలని చూసింది. అయితే గొట్టిపాటి సహా టీడీపీ ఎమ్మెల్యేలు ముందు వెనుకా ఆలోచించారు. దీంతో ఇక లాభం లేదనుకొని తాజాగా వైసీపీ సర్కార్ కొరఢా ఝలిపించింది.
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల గ్రానైట్ క్వారీ లీజులను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ప్రభుత్వం క్వారీయింగ్ లో లోపాలున్నాయని.. లీజులను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీతోపాటు ఆయన సన్నిహితుల ఆరు క్వారీలు.. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా బల్లికురవ వద్ద గరికపాటి రామ్మోహన్ కు చెందిన గ్రానైట్ క్వారీకి ముందుగా రూ.200కోట్ల జరిమానా విధించింది. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ రెండోసారి నోటీసులు ఇచ్చి బుధవారం సాయంత్రం పర్మిట్లు నిలిపివేస్తూ విషయాన్ని గరికపాటి క్వారీ మేనేజర్ కు సూచించింది.
Also Read: ‘మంత్రుల’పై సర్వేలో ఏం తెలిసిందంటే..!
గరికపాటి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో క్వారీ జోలికి అధికారులు వెళ్లరని అంతా భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీలో చేరినా గరికపాటికి షాక్ ఇవ్వడం సంచలనమైంది. టీడీపీ ఎమ్మెల్యేలే కాదు.. బీజేపీలో చేరినా వదిలిపెట్టమని వైసీపీ సర్కార్ ఈ దెబ్బతో నిరూపించినట్టైంది. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో గరికపాటి కంపెనీ ఉంది.
ఇలా వైసీపీలో చేరితేనే టీడీపీ ఎమ్మెల్యేలకు బతుకు.. లేదంటే అథోగతే అన్న హెచ్చరికను ఈ దెబ్బతో వైసీపీ సర్కార్ ఇచ్చింది. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. మరి ఆర్థికంగా దెబ్బతిని ఆస్తులు పోగొట్టుకుంటారా? లేక వైసీపీలో చేరి కాపాడుకుంటారా అన్న మీమాంస టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్లో వ్యక్తమవుతోంది.