
Badvel By Election 2021: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ మెజార్టీపై దృష్టి సారించింది. ఎలాగూ విజయం ఖాయమని భావిస్తున్న పార్టీ భారీ మెజార్టీ సాధించి పోటీలో ఉన్న పార్టీలకు సవాలు విసరాలని ఉబలాటపడుతోంది. ఇందులో భాగంగా నేతలను సమాయత్తం చేస్తోంది. మునుపటి కంటే ఎక్కువ మెజార్టీ సాధించి వైసీపీకి తిరుగులేదని నిరూపించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేస్తోంది. నియోజవర్గమంతా కలియ చుట్టి ప్రజల్లో చైతన్యం పెంచాలని చూస్తోంది.

వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ప్రజలకు సుపరిచతమే. వైద్యురాలిగా ప్రజలకు సేవలందించడంతో ఆమెకు ఓట్లు రాలుతాయని భావిస్తున్నారు. గైనకాలజిస్టుగా నియోజకవర్గ ప్రజలకు దగ్గరైన ఆమె ఇప్పుడు ఓ నాయకురాలిగా కూడా వారి అభిమానాన్ని చూరగొనాలని చూస్తున్నారు. బద్వేల్ బరిలో సుధ భారీ మెజార్టీ సాధించాలని తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బద్వేల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. అప్పట్లో ఆయన దాదాపు 44 వేల మెజార్టీ సాధించి వైసీపీ పట్టు ఏమిటో నిరూపించారు. ఇప్పుడు ఆయన భార్య అయిన సుధ కూడా తన మెజార్టీ పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. పోటీలో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నా వారి ప్రభావం అంతంత మాత్రమే అని పలువురు పేర్కొంటున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికలో మొదట పోటీలో ఉన్నట్లు ప్రకటించినా టీడీపీ విరమించుకుంది. జనసేన పోటీకి నై అంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీలో ఉన్నట్లు ప్రకటించాయి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమనే ఉద్దేశంతోనే పోటీలో ఉన్నట్లు బీజేపీ పేర్కొంది. రెండు పార్టీలు తమ అభ్యర్థులను దింపేందుకు నిర్ణయించుకున్నాయి. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు మాత్రం ఏకపక్షమే అని చెబుతున్నారు.