రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అధికార వైసీపీ పార్టీ నాయకుల దాడులు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం, రాజుపాలెం మండలానికి చెందిన కొందరు బీజేపీ కార్యకర్తలు తమకు ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు దాడులు చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, మూర్ఖుడైన టిప్పుసుల్తాన్ వీరాభిమాని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోద్భలంతో, వారి అనుచరుడు రవీంద్ర రెడ్డి తదితరులు గత రాత్రి కత్తులతో ప్రసాద్, నరసింహులు తదితర బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతుకలపై ఇలాంటి చర్యలు చాలా గర్హనీయమైనవని సోము వీర్రాజు అన్నారు.. కాబట్టి, దాడులకు తెగబడ్డవారిని, వారిని ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై తక్షణమే కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరుతున్నానని సోము తెలిపారు.
బీజేపీ కార్యకర్తలపై దాడులకు జగన్ ప్రభుత్వం స్పందించకుంటే ఈ దాడులపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తుందని హెచ్చరించారు.