
విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ లీకేజి ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎల్.జి పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌చేస్తూ ఈరోజు ఉదయం నుంచి పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది.
ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!
మరోవైపు పరిశ్రమలో పరిస్థితి చక్కబడుతుందని, నిపుణులు స్టైరీన్ వెలువడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రులు, ఉన్నతాధికారులు చెబుతున్న మాటలను పరిసర గ్రామాల ప్రజలు పట్టించుకోవడం లేదు. పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ప్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యిందని ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు.