YCP: అభ్యర్థులను మార్చితే వైసిపి అధికారంలోకి వచ్చేస్తుందా? ఇప్పుడున్న వ్యతిరేకత అంతా అభ్యర్థులపైనే నా? ప్రభుత్వంపై కించెత్తు వ్యతిరేకత కూడా లేదా? జగన్ పాలన అంత సవ్యంగా ఉందా? అంటే వైసీపీ అధినేత మాత్రం అవునంటున్నారు. మార్పు బాధితులు మాత్రం కాదంటున్నారు.అసలు అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశాం? ఎలా పాలించాం? అన్నది ఒక్కసారి జగన్ మననం చేసుకుంటే ఈ మార్పులు అనివార్యం కాకపోయేవి. వై నాట్ 175 అని నినదిస్తూనే.. ఈ మార్పులు దేనికి సంకేతం. ఎవరు మారాలి? ఎవరిని మార్చాలి? మార్పు చేస్తేనే గెలుపొందగలరా?లేకుంటే లేదా? దీనికి సమాధానం కూడా జగనే చెప్పాల్సి ఉంటుంది.
ఏపీ ప్రజలు అంతులేని విజయాన్ని కట్టబెట్టారు.ఏకపక్ష ఫలితాలను ఇచ్చారు. కానీ ఈ విజయం వెనుక ఎన్నో హామీలు కుమ్మరించానన్న విషయం జగన్ గ్రహించలేకపోయారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా.. ఇలా ఒకటేమిటి తుంగలో తొక్కిన హామీల జాబితా చాంతాడంత ఉంది. పైగా మాట తప్పం.. మడమ తిప్పం అన్న స్లోగాన్ ను తనకు తాను ప్రచారం చేసుకున్నారు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని.. మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయని.. తాము అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామని ముసలి కన్నీరు కార్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మార్చారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వందల వారాలు దాటినా చేయలేక చేతులెత్తేశారు. జిపిఎస్ తెచ్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారు. మెగా డీఎస్సీ వేస్తానని.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జగన్ ప్రభుత్వంలో డీఎస్సీ ఊసు లేదు. జాబ్ క్యాలెండర్ మాట లేదు. లక్షల్లో ఉద్యోగాలు అంటే వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను చూపి సంతృప్తులు.. ఆపై తనకు తానే ఆత్మీయ సత్కారాలు.. ఇలా ఒకటేమిటి నిరుద్యోగ యువతకు చుక్కలు చూపించారు. వారి ఆగ్రహానికి కారణమయ్యారు.
అత్యధికంగా ఎంపీలను తమ పార్టీకి కట్టబెడితే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. 22 మంది ఎంపీలను ఇస్తే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా గురించి.. విభజన హామీల గురించి జగన్ అడిగిన పాపాన పోలేదు. పైగా కేంద్రంలోని బిజెపి సర్కార్ కు మెజారిటీ ఉందని.. తాము ఏం చేయలేమని చేతులెత్తేశారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రతి నెల అప్పులు తెచ్చి డబ్బులను పంచి పెడుతూ పోతున్నారు. ఒక చేత్తో ఇచ్చిన డబ్బులను తిరిగి మద్యం, కరెంటు, ఇసుక రూపంలో మరో చేతితో దోచుకు తింటున్నారు. ఇవన్నీ చూసిన సామాన్యులు మాట తప్పడం, మడమ తిప్పడమే జగన్ పని అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని వ్యతిరేకత నాపై కాదని.. మీపైనేనంటూ ఎమ్మెల్యేలను, మంత్రులను బాధితులుగా మార్చుతుండడం మాత్రం ఒక ప్రమాదకరమైన విద్య. తప్పు మీరు చేసి.. శిక్ష తమకు వేస్తారా అంటూబాధితులు ప్రశ్నిస్తున్నారు. తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.