
కొత్త సంవత్సరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు ఉండగానే అక్కడి రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నడిపిస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. అదేస్థాయిలో బీజేపీపై దూకుడుగా వెళ్తున్నారు మమత. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని మమత చెబుతుండగా.. 200 సీట్లు గెలుచుకోబోతున్నామని బీజేపీ ప్రకటిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇక కాంగ్రెస్ పార్టీ మరో కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికల కూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఆమోదించిందని తెలిపారు.
లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ కోసం సీపీఎం సెంట్రల్ కమిటీ అక్టోబర్ నెలలోనే అంగీకారం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి స్థానాలను కేటాయించుకుని పోటీ చేయనున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఆ రాష్ట్ర అధికారాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే అమిత్ షా కూడా నెలలో ఏడు రోజులపాటు బెంగాల్లో మకాం వేయనున్నారు. ఇలా ఎవరికి వారు ఇప్పటి నుంచి బెంగాల్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తానికి ఈసారి బెంగాల్ ఎన్నికల మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా రసవత్తరంగా జరగబోతున్నట్లే అర్థమవుతోంది.