PM Modi 75: భారతీయ జనతా పార్టీలో 75 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే అనధికార నియమం కొత్తది కాదు. గతంలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, సుష్మా స్వరాజ్ వంటి అనేక సీనియర్ నేతలు ఈ వయోపరిమితి కారణంగా సైడ్‌లైన్ చేయబడ్డారు. ఈ క్రమంలో 2025లో 75 ఏళ్లు నిండబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తు గురించిన చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
Also Read: చంద్రబాబు దశ, ఆంధ్రా దిశ రెండూ మారనున్నాయా?
మోదీ స్థానం – ప్రత్యేకత
మోదీ కేవలం బీజేపీ ప్రధాన నాయకుడు మాత్రమే కాదు. ఆయన పార్టీకి గెలుపు చిహ్నం. 2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో మోదీ బొమ్మతోనే బీజేపీ వరుస విజయాలు సాధించింది. దేశవ్యాప్తంగా మోదీ వ్యక్తిత్వం, అభివృద్ధి అజెండా, జాతీయత భావజాలం ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఈ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించగా, రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం స్థానిక నాయకత్వం బలహీనత కారణంగా పరాజయాలు ఎదుర్కొంది.
75 ఏళ్ల నియమం – మినహాయింపు సాధ్యమా?
బీజేపీ ఈ వయోపరిమితిని సీనియర్ నేతల పట్ల గౌరవంగా, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడానికి అమలు చేస్తోంది. కానీ మోదీ సందర్భం వేరుగా ఉండొచ్చు. ఆయన వల్లే పార్టీ దేశవ్యాప్తంగా బలపడింది. 2029 ఎన్నికల వరకు మోదీని ముందుండనివ్వడం బీజేపీ వ్యూహాత్మక అవసరం కావచ్చు. ఆర్ఎస్ఎస్ కూడా మోదీని సులభంగా పక్కన పెట్టే అవకాశం తక్కువగానే ఉంది.
– తదుపరి నాయకత్వ రేసు
ఎప్పటికైనా మోదీ తర్వాతి యుగం రావాల్సిందే. ఈ రేసులో ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. అమిత్ షా ,యోగి ఆదిత్యనాథ్. అమిత్ షా మోదీకి అత్యంత సన్నిహితుడు, ఎన్నికల వ్యూహకర్త, దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణలో కీలకపాత్ర. యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్‌లో బలమైన హిందూత్వ ప్రతినిధి, పరిపాలనా కఠినత వల్ల జాతీయ గుర్తింపు.
-రాజకీయ భవిష్యత్తు
మోదీకి వయోపరిమితి కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందా లేదా అనేది పూర్తిగా పార్టీ, ఆర్ఎస్ఎస్ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తే మోదీకి రిటైర్మెంట్ సమయం దగ్గరగా ఉంటుంది. కానీ ప్రజా మద్దతు, ఎన్నికల విజయాల్లో మోదీ ప్రభావం దృష్ట్యా, ఈ నియమం ఆయనకోసం మార్చబడే అవకాశమూ ఉంది.
75 ఏళ్ల నియమం బీజేపీలో ఉన్నా, మోదీ విషయంలో ఇది కేవలం ‘సాంకేతిక’ అడ్డంకి మాత్రమే కావచ్చు. మోదీని తప్పించడం బీజేపీకి పెద్ద రిస్క్. కానీ ఆ రోజూ వస్తే, యోగి లేదా అమిత్ షా పార్టీని ముందుకు నడిపే అవకాశం ఉంది. మోదీ తర్వాతి బీజేపీ రూపు ఎలాంటి ఉంటుందనేది వచ్చే కొన్నేళ్లలోనే తేలిపోతుంది.