KCR Maharashtra : దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభతో దేశం చూపును తన వైపు తిప్పుకున్న బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. రాష్ట్రం బయట పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో మరో సభకు సిద్ధమయ్యారు.
2024 ఎన్నికలే టార్గెట్
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నాందేడ్ సభ నిర్వహిస్తున్నారు. సుమారు గంటపాటు సభలో కేసీఆర్ ప్రసంగిస్తారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందులో జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, బీజేపీ వైఫల్యాలను ఎండగడతారని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ మోడల్‌ను ఆవిష్కరిస్తారని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై కూడా మాట్లాడతారని తెలుస్తోంది.
భారీ జన సమీకరణకు ప్లాన్..
నాందేడ్ సభకు భారీ జన సమీకరణకు బీఆర్‌ఎస్ నేతలు కసరత్తు చేశారు. నాందేడ్ జిల్లాలోని సౌత్, నార్త్, బోకర్, నాయిగాం. ముథ్‌ఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ మండలాల నుంచి కూడా భారీ జనసమీకరణ చేశారు. మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోథ్, మథోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజవర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ శ్రేణులు ఇప్పటికే తరిలాయి. సుమారు రెండు లక్షల మంది సభకు హాజరయ్యేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఫ్లెక్సీలు, తోరణాలతో నాందేడ్ దారులన్నీ పూర్తి గులాబీ మయమయ్యాయి.
మరాఠాలో మరో పార్టీకి చోటుందా?
బీఆర్‌ఎస్ ఇంత ప్రయత్నం చేస్తున్నా.. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మరో పార్టీకి చోటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దాదాపు టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలోనే మరాఠాలో సీనియర్ కాంగ్రెస్‌నేత శరద్‌పవార్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇప్పటికీ సొంతంగా అధికారంలోకి రాలేదు. కాకపోతే ప్రభావం చూసేస్థాయికి ఎదిగారు. ఇక 20 ఏళ్లుగా బీజేపీ, శివసేన మైత్రి ఇక్కడ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోలనూ కలిసే పోటీ చేసినప్పటికీ ఉద్ధవ్‌థాక్రే అధికార కాంక్ష మిత్రపక్షంలో చీలిక తెచ్చింది. శివసేన సిద్ధాంతాని వ్యతిరేకంగా ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్‌సీపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏడాదిన్నరకే కూలిపోయింది. శివసేనలోనే ముసలం పుట్టి ఏక్‌నాథ్‌శిండే వర్గం బయటకు వచ్చింది. బీజేపీ మద్దతులో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇపుపడు మరాఠాలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీతోపాటు ఏక్‌నాథ్‌షిండే సారథ్యంలోని శివసేన చీలికవర్గం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు వీటికి అదనం. ఇలాంటి పరిస్థితిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరాఠాలను ఎలా మెప్పిస్తారు.. మరాఠాలు ఎంతవరకు కొత్త పార్టీని ఆదరిస్తారు అనేది వేచిచూడాలి.