AP BJP: ఏపీ బీజేపీకి అమిత్ షా, నడ్డాల చికిత్స ఫలిస్తుందా?

ప్రస్తుతం ఏపీలో విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నారు. జనసేన మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. పోనీ బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారంటే అదీ లేదు.

Written By: Dharma, Updated On : June 6, 2023 5:13 pm

AP BJP

Follow us on

AP BJP: ఏపీ బీజేపీకి సరైన లైన్ దొరకనుందా? అగ్రనేతలు వచ్చి దిశా నిర్దేశం చేయనున్నారా? రూట్ మ్యాప్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో వరుసగా పర్యటించనున్నారు. 8వ తేదీ విశాఖలో జరగనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నట్టు షెడ్యూల్ ఖరారు చేశారు. కారణాలేమిటో తెలిదు కానీ.. ఆయన పర్యటన వాయిదా పడింది. తిరుపతిలో జేపీ నడ్డా పర్యటన మాత్రం యధావిధిగా కొనసాగనుంది. ఆ ఇద్దరి నేతల పర్యటనపై పొలిటికల్ వర్గాలు ఫోకస్ పెంచాయి.

ఏపీ బీజేపీ నాయకులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. హైకమాండ్ వైఖరి తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వైసీపీతో పోరాటం చేయాలని ఆదేశాలిస్తారు. తీరా జగన్ సర్కారుతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటున్నట్టు సంకేతాలిస్తారు. అటు టీడీపీని కుటుంబ పార్టీగా అభివర్ణిస్తారు. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటిస్తారు. తీరా పార్టీ అధినేతను ఢిల్లీ పిలిచి మరీ చర్చిస్తుంటారు. పవన్ కళ్యాణ్ తమ మిత్రడనే సెలవిస్తారు. కానీ ఆయనతో ఉమ్మడి కార్యాచరణేదీ చేయరు. జనసేనతో కలిసి కార్యక్రమాలు చేపట్టరు.

ప్రస్తుతం ఏపీలో విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నారు. జనసేన మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. పోనీ బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారంటే అదీ లేదు. అటు టీడీపీ, ఇటు జనసేన అగ్రనేతలు బీజేపీ హైకమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నారు. అటు జగన్ సైతం తమపై చల్లని చూపు కొనసాగించాలని అదే పనిగా బీజేపీ పెద్దల్ని కోరుతున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు. బీజేపీకి తాము దూరం కాదు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఈ సమయంలో ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది బీజేపీ నేతలకు అంతుపట్టడం లేదు. అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై రాజకీయం విమర్శలు చేస్తే.. వైసీపీకి ఈ సారి పరోక్ష మద్దతు ఉండదని చెప్పినట్లవుతుంది. తమ గొప్పలు చెప్పుకుని వెళ్తే ఏపీలో బీజేపీ గురించి తాము పట్టించుకోవట్లేదని చెప్పినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే నడ్డా, అమిత్ షాలు ఇచ్చే సందేశం కోసం ఏపీ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చూస్తున్నారు.