West Bengal: పశ్చిమ బెంగాల్ జిల్లా హవ్ డా జిల్లాలోని శంకరైల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో గతంలోని వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం.. అయితే ఆ మహిళకు ఇటీవల ఫేస్ బుక్ లో బారక్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. తన ఆర్థిక సమస్యలను ఆ వ్యక్తికి చెప్పడంతో.. అతడు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అతడి ఆర్థిక నేపథ్యం అంతంత మాత్రమే కావడంతో ఆమె కూడా ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఈలోగానే ఆమెకు కిడ్నీ కొనుగోలు దారుడు ఒకరు పరిచయమయ్యారు. వారిద్దరూ అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ప్రకారం ఆమె తన భర్త కిడ్నీని అతడికి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.. ఈ ప్రణాళికను ఆమె దశలవారీగా అమలులో పెట్టింది. ముందుగా తన భర్తకు మాయమాటలు చెప్పింది.. కిడ్నీ అమ్మితే మన ఆర్థిక సమస్యలు తీరుతాయని నచ్చ చెప్పింది. మన కుమార్తెకు మెరుగైన విద్యను అందించవచ్చని సూచించింది.. ఆమె మాటలు నమ్మిన అతడు కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సరిగ్గా మూడు నెలల క్రితం ఆపరేషన్ చేశారు.. అతడి కిడ్నీని విక్రయించారు. కొనుగోలుదారుడు వద్ద నుంచి పది లక్షలు తీసుకున్నారు.. ముందు ఈ నగదు తన భర్తకు ఇచ్చిన ఆమె.. అతడు దాస్తుంటే చూసింది. ఒకరోజు అతడు గాఢ నిద్రలో ఉండగా ఆ డబ్బులు తీసుకొని తన కుమార్తెతో కలిసి పారిపోయింది. తెల్లవారుజామున లేచి చూడగా భార్య కనిపించకపోవడం, కూతురు అగుపించక పోవడం, ఇంట్లో డబ్బు లేక పోవడంతో అతడికి అనుమానం వచ్చింది..
పోలీసులకు ఫిర్యాదు చేయగా..
ఈ విషయంపై ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు మొత్తం చెప్పాడు. అతడు చెప్పిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు లోకేషన్ ట్రేస్ చేశారు. వారు బారక్ పూర్ లో ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళగా ఓ గదిలో ఆమె, తన కుమార్తె, ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రియుడితో కనిపించింది. అయితే పోలీసులను దూరం నుంచి గమనించిన ఆమె తలుపు గడియ వేసుకుంది. పోలీసులు, ఆమె భర్త ఎంత సేపు తలుపు కొట్టినా తీయలేదు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించింది. చివరికి విడాకులు ఇస్తానంటూ స్పష్టం చేసింది. దీంతో ఆ పోలీసులు అక్కడి నుంచి వెను తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఈ వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించి..ఆమెను, కుమార్తెను ప్రియుడిని వెనక్కి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. మరోవైపు తన కిడ్నీ కోల్పోయానని.. డబ్బు నష్టపోయానని.. వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆ భర్త ఏడవడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు భర్త ఏడుస్తున్నప్పటికీ ఆమె ఏమాత్రం బయటికి రాకపోవడం.. తలుపు గడియ తీయడానికి కూడా ఒప్పుకోకపోవడం విశేషం.