లేడీ సూపర్‌స్టార్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌డమ్ సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ సాధించి.. అటు మెగాస్టార్ పైన.. ఇటు కేసీఆర్ పైన చాలాసార్లు విమర్శలు చేశారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అయ్యారు.
అయితే.. చాలా కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో అంత పెద్దగా యాక్టివ్ రోల్స్‌లో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ముఖ్యులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో విజయశాంతికి కూడా వారి వైఖరి నచ్చడం లేదట. అందుకే గాంధీ భవన్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల మీటింగ్‌లోకూ అటెండ్ కావడం లేదు.
అయితే.. త్వరలో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి విజయశాంతి అవుతారని అందరూ భావించారు. కానీ.. ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి అదే పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి హాజరుకాకపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దుబ్బాక నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలోనూ ఇదే అంశం హాట్ టాపిక్‌లా మారింది.
విజయశాంతి వైఖరి ఇలా ఉంటే.. దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు పెద్దగా నేతలు లేకపోవడంతో అధిష్ఠానం మాత్రం విజయశాంతి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఆమెనే రంగంలోకి దించాలని భావిస్తున్నారని సమాచారం. అయితే.. అందుకు ఆమె సిద్ధంగా లేనట్లుగా అర్థమవుతోంది. మూడేళ్ల పదవీకాలం.. పైగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఆమె పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నట్లు వినిపిస్తోంది.
అలక మీద ఉన్న విజయశాంతిని కాంగ్రెస్ నేతలు ఎలా ఒప్పింగలరు..? ఇన్నాళ్లు ఆమెకు అనుకున్న స్థాయిలో ప్రాముఖ్యతను ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆమెతో ఎలా మాట్లాడగలరు..? ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయశాంతి అంగీకరిస్తుందా..? వీటిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..!