ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు ఇబ్బడిముబ్బడిగా వేసింది. తీరా విచారణకు వచ్చేసరికి ముందుకు రావడం లేదు. విచారణకు సమయం కావాలని న్యాయవాదుల ద్వారా కోరుతోంది. దీంతో సర్కారు తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కరోజే నాలుగు కేసులు మూడు వారాలకు వాయిదా పడ్డాయి.
అమరావతి భూముల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి ప్రభుత్వం స్టే నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసరికి విచారణకు మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్ స్పైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
ఇందులోనూ విచారణకు మూడు వారాల సమయం కావాలని కోరింది. మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి ఆస్తుల కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇందులో కూడా మూడు వారాల గడువు కావాలని అడిగింది. అన్ని కేసుల్లో ఇలాగే కోరడంపై న్యాయమూర్తి అంగీకరించడం జరిగిపోయాయి.
సుప్రీంకోర్టుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు వాదనలు వినిపించడానికి వెనకడుగు వేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వైపు సీజేఐకి జగన్ లేఖను బహిర్గతం చేయడంపై చర్యలు తీసుకోవాలని గతంలో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ పై వివరణ ఇవ్వడానికి సుప్రీంకోర్టును మూడు వారాల గడువు కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వాయిదాల పద్ధతిని ఆశ్రయిస్తోంది.