Bandi Sanjay: ‘బండి సంజయ్ కళ్లు నెత్తికెక్కి అహంకారం ఎక్కువైంది. ఆయన ఎవరినీ కలుపుకొని పోరు. దుబ్బాకలో నా గెలుపులో పార్టీ పువ్వు గుర్తు చివరి అంశం’ అని తమ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయత్వంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన 3 గంటల తర్వాత తెలంగాణభవన్‌లో మరోసారి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నడ్డా, అమిత్‌షాలపై అనని మాటలు అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోందని, అవి తప్పుడు కథనాలని.. తన మాటలను వక్రీకరించవద్దని కోరారు. క్రమశిక్షణ కలిగిన సైనికునిగా బీజేపీలో భాజపాలో పదేళ్లుగా పనిచేస్తున్నానని, మీడియాతో సరదాగా మాట్లాడిన మాటలను కొన్ని ఛానెళ్లు తప్పుగా ప్రసారం చేస్తున్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు.
అధిష్టాన అడిగితే బాధ్యతలు స్వీకరిస్తా..
ఇదే సమయంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష మార్పుపై కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అధిష్టానం పిలిచి అడిగితే మాత్రం ఆ బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీని కోరడానికి దిల్లీ వచ్చానని తెలిపారు. బీజేపీ నుంచే మరోసారి దుబ్బాక నుంచి గెలిచి వస్తానని.. తాను, కమలం గుర్తు వేర్వేరు కాదని స్పష్టం చేశారు.
కిషన్‌రెడ్డి నివాసంలో ఇలా..
అంతకుముందు కిషన్‌రెడ్డి నివాసంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ‘ఎంపీగా పోటీ చేసినప్పుడు భార్య పుస్తెలు తాకట్టు పెట్టిన వ్యక్తి రూ.వందల కోట్లను ప్రచారానికి ఎలా ఇచ్చారు. అవి పార్టీ డబ్బులు. ఆ డబ్బుల్లో నాకూ వాటా ఉంది. ప్రకటనల్లో తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌తోపాటు ఎవరికీ తెలియని ఫొటోలు పెట్టారు. నాది, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు ఫొటోలు పెట్టలేదు. మేం ఓట్లు తెచ్చేవాళ్లం. వారి ముఖాలు చూసి ఎవరు ఓట్లేస్తారు. పార్టీ అధ్యక్ష మార్పుపై మీ (విలేకరులను ఉద్దేశించి) ప్రచారం నిజమే. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధం. రాష్ట్ర పార్టీలు సక్రమంగా లేనిచోట్లకు అందర్నీ కలుపుకొనిపోయేలా కేంద్ర మంత్రులను రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పంపుతారు. గతంలో కాంగ్రెస్ అమలు చేసిన కామరాజ్ పథకాన్ని ఇప్పుడు బీజేపీలోనూ తీసుకురావాలని మా అధిష్టానం ప్రయత్నిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దుబ్బాక నాదే.. గెలిచేది నేనే..
‘దుబ్బాకలో గెలుపు నా స్వయంకృషి. నా విజయం తర్వాతే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను గెలిపిస్తానంటూ రాజగోపాల్‌రెడ్డి భుజంపై అమిత్‌షా చేయి వేశారు. ఆయన చాణక్యం ఏమైంది? రూ.వంద కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయాం. అదే రూ.వంద కోట్లు నాకిస్తే రాష్ట్రాన్ని దున్నేస్తా. రాష్ట్ర అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష నేత, జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని అడుగుతున్నా. వాటికి నేను అర్హుడినే. ఇస్తే తీసుకుంటా.. లేకుంటే అవకాశాలు వెతుక్కుంటూ పోతాం. నడ్డాపై మోదీ కోర్టులో వకాల్తా వేస్తా. ఆరు నెలలు ముందు వచ్చిన వాళ్లే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అడుగుతున్నప్పుడు నేనెందుకు అడగకూడదు. పదేళ్లుగా మా పార్టీలో నా అంత కష్టం ఎవరు పడ్డారు. నేను వంద మందికి సమాధానం చెప్పగలుగుతా. మా పార్టీలో అలా చెప్పేవారు ఒక్కరిని చూపండి. దుబ్బాకలో పువ్వు గుర్తుతోనే నేను గెలవలేదు. అక్కడ మోదీ, అమిత్‌షాల ముఖం ఎవరూ చూడలేదు. అమిత్‌షా ప్రచారానికి కూడా రాలేదు. నాకు ఒక్క పైసా ఇవ్వలేదు. కేసీఆర్‌ను ఢీకొట్టే మొగోడిని నేనే అని జనం నమ్మినందునే గెలిచా. మళ్లీ గెలుస్తా. నాకంటే ముందు దుబ్బాకలో పువ్వు గుర్తుపై పోటీ చేసిన వాళ్లకు 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయి’ అని గుర్తుచేశారు.
బీజేపీ ఎల్పీ ఖాళీ ఉందని తెలియదు..
‘శాసనసభలో మేం ముగ్గురముంటే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఉంది. ఇద్దరిలో ఒకరికి శాసనసభ పక్ష నేత పదవి ఇవ్వాలిగా? ఆ పదవి ఖాళీగా ఉన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకెళ్లినప్పుడు ‘యే క్యాహై’ (ఇదేమిటి) అంటూ నన్నే తిరిగి ప్రశ్నించారు. ఆయనకా పదవి ఖాళీగా ఉన్న విషయమే తెలియదు. అలా ఉంది మా నాయకుల పనితీరు. శాసనసభ పక్షం పదవి విషయంలో నా కులమే నా బలహీనత కావచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ ఫ్లోర్‌లీడర్ ఉంటారు. 48 మంది సభ్యులున్న జీహెచ్‌ఎంసీలో ఫ్లోర్‌లీడర్ ఉండరు. ఫ్లోర్‌లీడర్ కావాలని పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి అడిగి అడిగి చనిపోయారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్‌ను జైలుకు పంపుతాం..
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ది బలుపు కాదు… అది వాపు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఓ వర్గానికి చెందిన మీడియా ప్రయత్నిస్తోంది. చూస్తూ ఉండండి. రెండు నెలల్లో ఓటుకు నోటు కేసు’ను బయట తీసి ఆయన్ను జైలుకు పంపిస్తాం’ అని రఘునందన్‌రావు వ్యాఖ్యానించడం గమనార్హం.