
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏర్పడిన దోస్తీ రెండు ప్రాంతాల తెలుగు ప్రజలకు మేలు కలగడం కోసం, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకోసమేనా?
ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి కాపాడటం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతపు కాంజిట్రాక్టుదారుల కమీషన్ల కోసమే ప్రాజెక్ట్ లు చేపడుతున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.
రెండు రాష్ట్రాలలో కీలకమైన నీటిపారుదల ప్రాజెక్ట్ లు అన్ని ఒకరిద్దరు కాంట్రాక్టుదారులకే కట్టబెడుతున్నారు. వీరే ఇద్దరు సీఎంల మధ్య సయోధ్యలో కీలక పాత్ర వహిస్తున్నారని వినికిడి. మొత్తం కలిసి రెండు రాష్ట్రాల ఖజానాలకు బొక్క పెడుతున్నారని ప్రతీతి.
తాజాగా తన సొంత జిల్లాకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కు రోజుకు 10 టిఎంసి నీళ్లను కృష్ణ నుండి తరలించే ప్రయత్నం సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్రవహిస్తూ ఉండడం తెలంగాణలోని నాయకులకు అంతుబట్టడం లేదు.
నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టి కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించేందుకు ఉత్తర్వులు జారీ చేస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ విధమైన ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ ఆయనపై విరుచుకు పడ్డారని గుర్తు చేశారు.
పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీళ్లు తరలిస్తే వికారాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాలకు తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుందని తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.