Pravallika Death: నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య ఘటనను వక్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అనుమానాలే చివరికి నిజమయ్యాయి. దీన్ని స్వయంగా ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారని చేసిన ఆరోపణలే వాస్తవమయ్యాయి. ఆమె గ్రూప్స్ పరీక్షలకే దరఖాస్తు చేయలేదని, గతంలో ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదన్న వ్యాఖ్యలు.. మీడియాతో మాట్లాడొద్దంటూ మృతురాలి తల్లిదండ్రులకు పోలీసుల బెదిరింపులు.. ఊతమిస్తున్నా యా? జరుగుతున్న పరిణామాలన్నింటికీ ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది. చివరికి ప్రవళిక తల్లితో ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పించడం, అధికార పార్టీ మీడియాలో ఆ వార్త గురించి ప్రముఖంగా రావడం పై వాటికి బలం చేకూర్చుతోంది.
గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరిన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. పోటీ పరీక్షలు పదే పదే వాయిదా పడుతుండటంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ప్రవళిక రాత్రి పదిగంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటే వేలాది మంది నిరుద్యోగులు క్షణాల్లోనే పోగయ్యారు. తెల్లవార్లూ తమఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పోలీసులు చెదరగొడితే తప్ప కదల్లేదు. ఈ స్థాయిలో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమైతే ఆత్మహత్య ఘటనను పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి మొన్నటికి మొన్న సెంట్రల్ జోన్ డీపీసీ వెంకటేశ్వర్ రా వు, తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలే ఉదాహరణ అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రేమ వైఫల్యమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం అని, దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్‌లు లభించాయని ప్రెస్‌మీట్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. పైగా ఆమె ఏ పోటీ పరీక్షలకూ దరఖాస్తు చేయలేదని ఆయన స్ప ష్టం చేశారు. దీనిపై ఇప్పటికే నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుంటే.. దీనికి అగ్గి రాజేసేలా మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు.
ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ ప్రవళిక ఏ పోటీ పరీక్షకూ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఆ అమ్మాయి అసలు గ్రూ ప్స్‌కే అప్లయ్ చేయలేదట.. తెలుసుకోండి. వాదోపవాదనలకు పోతే ఆ అమ్మాయి వాట్సప్ చాటింగ్‌లు బయటకొస్తాయి. అప్పుడు పరువు నష్టం ఎవరికి? చనిపోయిన అమ్మాయి కుటుంబానికే కదా? వ్యక్తిగత గోప్యం ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రవళిక టీఎ్‌స పీఎస్సీ విడుదల చేసి నోటీఫికేషన్లలో తాను అర్హత ఉన్న ఐదు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4లతో పాటు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2కు దరఖాస్తు చేసింది. ప్రవళిక టీఎ్‌సపీఎస్సీ ఐడీ నంబరు 1201237790తో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఆమె చేసుకున్న దరఖాస్తులు (గ్రూప్-1 దరఖాస్తు నంబరు 2200255353, గ్రూప్-2 దరఖాస్తు నంబరు 2228305716, గ్రూప్-3 దరఖాస్తు నంబరు 22290243774, గ్రూప్-4 దరఖాస్తు నంబరు 2219145585, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 దరఖాస్తు నంబరు 2208093398) నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జరిగిన గ్రూప్-4కు, రెండుసార్లు జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ప్రవళిక హాజరయ్యిందంటూ ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఫలితంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్య లు ప్రవళిక ఆత్మహత్య ఘటనను ఉద్దేశప్వూరకంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత గోప్యం ముఖ్యం అని వ్యాఖ్యానించిన కేటీఆర్, అమ్మాయి అసలు గ్రూప్స్‌కే అప్లయ్ చేయలేదట అని అనడం ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రవళిక సంబంధించిన దరఖాస్తులను మంత్రి కేటీఆర్ వీడియోకు జోడించి మరీ ప్రశ్నిస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో హడావుడిగా పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేముందని, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పెట్టారా.? లేకుంటే ప్రభుత్వ పెద్దల సలహాలను పాటించారా.? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య సందర్భంలో పోలీసులు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదని, టీఎ్‌సపీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంలో ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటి వరకు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రవళిక కుటుంబసభ్యులను మీడియాతో మాట్లాడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
కుటుంబ పరువు తీయొచ్చా.?
మహిళలు అత్యాచారాలకు గురైనప్పుడు, బలవన్మరణానికి పాల్పడినప్పుడు వారి కుటుంబసభ్యులను ఇబ్బంది కలిగించకుండా పోలీసులు జాగ్రత్త పడాలంటూ సు ప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రవళిక విషయంలో మాత్రం బాధితురాలికి ఓ కుటుంబమూ ఉందనే విషయాన్ని డీసీపీ మరిచి ‘ప్రేమ వైఫల్యం, మోసపోయింది’ అనే విధంగా మాట్లాడారని, ఆ రకంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం పదే పదే ఉల్లంఘించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఫోన్ చాటింగ్ ఆధారంగా ప్రెస్‌మీట్‌లో యువతి ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణం అని ఆయన తేల్చేయడాన్ని తప్పుబడుతున్నారు. తల్లికి రాసిన లేఖలో ఎ క్కడా ఆమె ప్రేమ, స్నేహితుడి గురించి రాయలేదని, కానీ డీసీపీ మాత్రం.. ప్రేమ వైఫ్యలంతోనే ఆ లేఖ రాసినట్లు చెప్పడం ఘటనను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపిస్తున్నారు. ప్రవళిక ప్రేమ వ్యవహారాన్ని డీసీపీ ఆ స్థాయిలో ప్రెస్‌మీట్‌లో చెప్పి ఆమె తల్లిదండ్రుల మానసిక క్షోభను మరింత పెంచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.