Why Modi said not to buy Gold: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. దీనిని సంప్రదాయానికి, సంపదకు, సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహాలు, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయాల్లో బంగారం కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొన్ని గణాంకాల ప్రకారం.. భారతీయులు ఏటా సగటున 700 నుండి 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడానికి ఇక్కడి ప్రజలకు ఈ పసిడిపై ఉన్న మక్కువనే ప్రధాన కారణం. అయితే ఇటీవల మోదీ బంగారం ఎక్కువగా కొనుగోలు చేయొద్దని ప్రకటన చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?
దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా మన దేశీయ ఉత్పత్తి అత్యంత స్వల్పంగా ఉంది. ఏటా కేవలం 1 నుండి 2 టన్నుల బంగారం మాత్రమే మన గనుల నుండి లభిస్తోంది. దీనివల్ల దాదాపు 90 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌ను విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వస్తోంది. ముడిచమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతుల కోసమే. దీనివల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరిగి, రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు తెలిపారు. కనీసం ఏడాది పాటు కొత్త బంగారం కొనకుండా ఉండటం వల్ల దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని, ఆ నిధులను దేశాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పసిడిపై పెట్టుబడి పెట్టడం వల్ల అది వ్యక్తిగతంగా లాభదాయకంగా అనిపించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా అది ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’ గానే మిగిలిపోతుందనేది నిపుణుల వాదన.
బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ‘సావరిన్ గోల్డ్ బాండ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. భౌతికంగా బంగారాన్ని కొని లాకర్లలో దాచుకోవడం కంటే, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల విదేశీ దిగుమతుల భారం తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులకు భద్రతతో పాటు అదనపు వడ్డీ కూడా లభిస్తుంది. ప్రజలు తమ పెట్టుబడి దృక్పథాన్ని మార్చుకుని, భౌతిక బంగారం నుంచి డిజిటల్ , బాండ్ల వైపు మళ్ళినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.