తెలంగాణలో రాజకీయం రంగు మారుతోంది. పార్టీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లోగా పెనుమార్పులు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పావులు కదుపుతున్నాయి. ఈటల రాజేందర్ బయటకు రావడంతో లోలోపల చాలామంది నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు అవుతున్న సందర్భంలో కేసీఆర్ వెంట ఉన్న వారు క్రమంగా తెరమరుగు అవుతున్నారు.
కేసీఆర్ కు టీడీపీలో ఉన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మరో మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి ఈ ముగ్గురు కేసీఆర్ తొలి ప్రభుత్వంలో హీరోలుగా ఉండి ఇప్పుడు ఎవరికి పట్టని జీరోలుగా మారిపోయారు. చివరకు ఈ ముగ్గురు అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాజీ స్పీకర్ మధుసూదనాచారి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మంత్రి పదవి ఆశించినా కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అప్పగించారు. కానీ 2018 ఎన్నికల్లో మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లోకి రావడంతో అక్కడ మధుసూదనాచారిని పట్టించుకునే వారే లేరు. ఇక ఎన్నికలకు ముందు సీటు వదులుకుంటే ఆయనకు కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ చేశారు. అసలు ఇప్పుడు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వని పరిస్థితి.
ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తుమ్మల నాగేశ్వర్ రావు గత ఎన్నికల్లో పాలేరులో ఓటమి పాలయ్యారు. తరువాత ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ పట్టించుకోలేదు. మరో మంత్రి కడియం శ్రీహరిది అదే పరిస్థితి. వరంగల్ ఎంపీగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. తరువాత ఎంపీ టికెట్ లేదు. మంత్రి పదవి లేదు. కనీసం అపాయింట్ మెంట్ లేకపోవడంతో కడియం కూడా అసంతృప్తితోనే ఉన్నారు.