Chandrababu Political Asceticism: చంద్రబాబు స్ట్రాటజీ మార్చారా? అధికార పార్టీ దూకుడును సెంటిమెంట్ అస్త్రంతో కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్నారా? ప్రజల మైండ్ సెట్ ను మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవే తన చిట్టచివరి ఎన్నికలని ప్రకటిస్తున్నారు. తనతో పాటు టీడీపీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా? లేకుంటే మరోసారి దగాకు గురవుతారా? అంటూ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంకేతాలిస్తున్నారు. అయితే ఇది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. ఏపీ పాలిటిక్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

జగన్ అండ్ కో దూకుడుకు చంద్రబాబు తట్టుకోలేకపోయారు. శాసనసభలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఆయన సతీమణి పేరు బయటకు తెచ్చి వివాదాస్పదం చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఒకానొక దశలో బోరున విలపించారు. అప్పుడే తాను శాసనసభకు తిరిగి సీఎంగానే వస్తానని శపథం చేశారు. అయితే అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అటు పవన్ సైతం ఒక్క చాన్స్ అన్న స్లోగన్ మొదలు పెట్టారు. దీంతో 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తానెక్కడ వెనుకబడిపోతానో అని ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాలను బయటకు తీస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు వయసు మీద పడుతోంది. ఏడు పదులు దాటింది. అటు కుమారుడు లోకేష్ చూస్తే రాజకీయ పరిణితి సాధించలేదు. అందుకే మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని చూస్తున్నారు. కుమారుడి పాదయాత్రకు గ్రౌండ్ రిపోర్టు రూపొందిస్తున్నారు. తాను అన్ని జిల్లాల పర్యటనలు చేసి పాదయాత్రకు లైన్ క్లీయర్ చేస్తున్నారు. పనిలో పనిగా దూరమైన వర్గాలను దగ్గరకు చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహజంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రోడ్ షోలు, సభలు, సమావేశాలకు భారీగా జనాలు వస్తున్నారు. అందుకే చంద్రబాబు స్ట్రాటజీని మార్చారు. రాజకీయ సన్యాసం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కానీ ఓటమి ఎదురైతే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమే. అటు పార్టీలో కూడా నాయకత్వ సమస్య వస్తుంది. లోకేష్ ను ఎక్సెప్ట్ చేసే నాయకులు పార్టీలో కొద్దిమందే. చాలా మంది సీనియర్లు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే బాబు చాలారకాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎక్కడా నోరు జారడం లేదు. పక్కాగా, పద్దతిగా ప్రజల సానుభూతి పొందేందుకు సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అవి ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి మరీ.