Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan- Pawan Kalyan: పోలవరానికి డబ్బులు తెచ్చిన ఘనత ఎవరిది? పవన్ దా? జగన్...

CM Jagan- Pawan Kalyan: పోలవరానికి డబ్బులు తెచ్చిన ఘనత ఎవరిది? పవన్ దా? జగన్ దా?

CM Jagan- Pawan Kalyan: పోలవరం ఏపీ ప్రజల జీవ నాడి. విభజిత ఏపీని సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజల దాహార్తిని తీర్చే అపర భగీరధి. కానీ పాలకుల చిత్తశుద్ధి లోపం ప్రాజెక్టుకు శాపంగా మారింది. దశాబ్దాలు దాటుతున్నా జాతికి అంకితం కావడం లేదు. పెండింగ్ పనులు పూర్తికావడం లేదు. ఈ పాపం ప్రజలకే శాపంగా మిగిలింది. కానీ పాలకులకు మాత్రం రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రాజెక్టుగా మిగలడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రూ.13 వేల కోట్లు అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది మా కృషి ఫలితమేనంటూ నేతలు ముందుకొస్తున్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఇందులో వాస్తవాలు మరుగునపడుతున్నాయి. నిధుల కోసం కృషిచేసిన నాయకులను తెరమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చంద్రబాబు పట్టిసీమకు ఇచ్చిన ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వకపోవడం వాస్తవం కాదా?నాటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి బీజేపీ సభ్యుడు సురేష్ ప్రభుకు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కూడా చంద్రబాబు రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను సాధించకపోవడం నిజం కాదా? తెలంగాణలో ఓటుకు నోటు కేసు తనను వెంటాడటంతో ఆ కేసు విషయంలో కేంద్ర పెద్దల ముందు మోకరిల్లారనే అపవాదను చంద్రబాబు మూటగట్టుకున్నారు. పోలవరంకు క్రమానుసారం నిధులు సాధించలేకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేయకపోవడం వంటి ఆ ప్రాజెక్టుకు శాపాలుగా మారాయి. పట్టిసీమ పై పెట్టిన డబ్బులు పోలవరం పై పెట్టి ఉంటే.. పోలవరం సగ భాగం పూర్తి అయ్యేదని నిపుణులు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరంపై దృష్టిపెట్టారా? అంటే సమాధానమే కరువు. సీఎం హోదాలో ఆయన ఐదుసార్లు ప్రాజెక్టు బాట పట్టారు. ఇదే పేరు పెట్టుకొని లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ బాట పట్టారు. అయినా వర్కవుట్ అయ్యిందా అంటే కాలేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 జూన్‌ 20వ తేదీన, అదే ఏడాది నవంబరు 4న, 2020 డిసెంబరు 12న, 2021 జూలై 19న పోలవరం ప్రాంతంలో జగన్‌ పర్యటించారు. కానీ 73 శాతం జరిగిన పనులను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం.. పోలవరం కు నిధులు అడిగానని ప్రకటించడం రివాజుగా మారింది.

అయితే ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు రూ.13 వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఎవరి కృషి అంటే.. అది ముమ్మాటీకి జనసేన అధినేత పవన్ దనే చెప్పొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 4న పవన్ కేంద్ర పెద్దలను కలిశారు. జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా కాలయాపన చేస్తోందని ఫిర్యాదు చేశారు. నిధుల కొరత పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జాప్యం చేస్తోందని చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటోన్నాయని వివరించారు. నిధులను విడుదల చేయట్లేదంటూ జగన్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందంటూ వివరించారు. దాని ఫలితమే రూ.13 వేల కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. కుర్చీ మీద కూర్చున్న వాడు మాట తప్పి.. మడం తిప్పాడు. రెండుచోట్ల ఓడిన వాడు బాధ్యత తెలిసి కేంద్రంతో చర్చలు జరిపాడు. దాని ఫలితమే పోలవరం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి.


Recommended Video:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular