https://oktelugu.com/

‘నాగార్జున సాగర్ లో అభ్యర్థులెవరు? గెలుపు ఎవరిది?

ఎన్నికలొస్తే పొలిటికల్ పార్టీలకు పూనకం వచ్చినట్లే అవుతుంది. అందులో కిక్కును వెతుక్కుంటే ఉంటాయి. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్లి ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తిపోయొచ్చు కదా అనే అభిప్రాయంలో ఉంటాయి. అందుకే.. ఎన్నికలు వచ్చాయంటే ఉత్సాహంగా.. ఉత్కంఠగానూ ప్రచారపర్వంలోకి దూసుకెళ్తారు. ఎన్నిక ఏదైనా సమర శంఖం పూరించి.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిందే. ఇప్పుడు తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో ఇదే జరుగుతోంది. రాబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టాయి రాజకీయ పార్టీలు. ఇంతకీ సాగర్‌లో ఆయా […]

Written By: , Updated On : March 18, 2021 / 10:56 AM IST
Follow us on


ఎన్నికలొస్తే పొలిటికల్ పార్టీలకు పూనకం వచ్చినట్లే అవుతుంది. అందులో కిక్కును వెతుక్కుంటే ఉంటాయి. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్లి ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తిపోయొచ్చు కదా అనే అభిప్రాయంలో ఉంటాయి. అందుకే.. ఎన్నికలు వచ్చాయంటే ఉత్సాహంగా.. ఉత్కంఠగానూ ప్రచారపర్వంలోకి దూసుకెళ్తారు. ఎన్నిక ఏదైనా సమర శంఖం పూరించి.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిందే. ఇప్పుడు తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో ఇదే జరుగుతోంది. రాబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టాయి రాజకీయ పార్టీలు. ఇంతకీ సాగర్‌లో ఆయా పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు..? ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: జనసేన ని ఎంత తొక్కినా భూమిని చీల్చుకొని పుడుతుంది

*సాగర్‌‌పైనే పార్టీల ఫోకస్‌
నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఫీల్డ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీ, రెడ్డి కులాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత తన అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రకటించింది. ఆయన మూడు నెలలుగా అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఉంటూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.

* గెలుపు కోసం వ్యూహాలు
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం తగ్గిన అధికార టీఆర్ఎస్ కు సాగర్‌ బై పోల్‌లో గెలుపు అనివార్యమైంది. అటు వరుసగా ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ నాగార్జునసాగర్‌లో కూడా పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇప్పటికి ఏడుసార్లు విక్టరీ సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఎనిమిదో సారి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.

* టీఆర్‌‌ఎస్‌ పక్కా స్కెచ్‌
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం పక్కా స్కెచ్‌తో బరిలో దిగుతోంది టీఆర్‌ఎస్‌. దుబ్బాకలో జరిగిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకొని.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇంతకీ.. నాగార్జునసాగర్‌ బరిలో నిలిచే గులాబీ నేత ఎవరు..? అందరికీ ఆమోదయోగ్యమైన లీడర్‌ను వెతికే పనిలో టీఆర్ఎస్ ఉందా..? ఇప్పటి వరకు టికెట్‌ రేసులో ఉన్నదెవరు..? తెలియకుండా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌.. ఈ ఉపఎన్నికపై చర్చించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకుని ఉపఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని.. కేసీఆర్ అన్నారట. అయితే.. ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బరిలో నిలిచే నేత ఎవరు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హలీయాలో జరిగే సభతో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇటు నాగార్జున సాగర్ నియెజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై అంతర్గగతంగా నివేదికలు తెప్పించుకుంది టీఆర్ఎస్. అక్కడ ఎన్నికల షెడ్యూలు వచ్చే లోపే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉపఎన్నికల్లో బలమైన అభ్యర్థి లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని టీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణలో తేలింది. దుబ్బాక ఫలితంతో నేర్చుకున్న గుణపాఠాలతో.. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా గులాబీ పార్టీ చూసుకుంటోంది. అందుకే నాగార్జునసాగర్‌ బైఎలక్షన్‌లో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనుకుంటోంది.

Also Read: ఎమ్మెల్సీ కౌంటింగ్: టీఆర్ఎస్ అభ్యర్థులదే ఆధిక్యం

* అభ్యర్థి కోసం అన్వేషణ
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ ఆరా తీస్తోంది. యాదవ, రెడ్డి కులంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు టీఆర్ఎస్లీడర్లు చెప్తున్నారు. నియోజకవర్గంలో యాదవ కులం ఓట్లు దాదాపు 40 వేలు ఉన్నాయి. మరోవైపు సెగ్మెంట్‌లో రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలిసింది. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌తోపాటు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరపు చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి రేసులో ఉన్నారు. నాగార్జునసాగర్ లో యాదవ సామాజిక వర్గం, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. అప్పట్లో నోముల నర్సింహయ్యను బరిలోకి దింపింది టీఆర్ఎస్. ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన గురువయ్య యాదవ్ నాగార్జున సాగర్ టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రి జగదీష్ రెడ్డికి సన్నిహితుడు అయిన కోటిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. కోటిరెడ్డికి అవకాశం వచ్చేలా మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి వీరెవరూ కాకుండా కొత్తగా ఎవరైనా తెరపైకి వస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

* భగత్‌కు టికెట్టా? బుజ్జగింపా?
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు నోముల నర్సింహయ్య కొడుకు భగత్ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆయనకు టికెట్ఇవ్వాలా లేక బుజ్జగించాలా అనే దానిపై టీఆర్ఎస్ నాయకత్వం చర్చలు జరుపుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చి సాగర్ లో నోముల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే విమర్శలు వస్తాయని లీడర్లు చెప్తున్నారు.

* బీజేపీలో దుబ్బాక జోష్‌
ఇక దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్‌తో.. బీజేపీ క్యాడర్‌లో నూతనోత్తేజం కనిపిస్తోంది. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన కంకణాల నివేదిత, కడారి అంజయ్య యాదవ్‌తోపాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదితకు డిపాజిట్ కూడా దక్కలేదు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కడారి అంజయ్య యాదవ్ 30 వేల ఓట్ల సాధించారు. ఆయనకు సామాజికవర్గం మద్దతు బలంగా ఉండడం కలిసొచ్చే అంశం కాగా.. నివేదితకు పార్టీలో పైస్థాయి నేతల మద్దతు ఉండడం కలిసొచ్చే అంశంగా ఉంది. ఇక జానారెడ్డి అనుచరుడిగా పేరున్న ఇంద్రసేనారెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాకనే బీజేపీలో చేరారనే ప్రచారం ఉంది. ఈ ముగ్గురిలో ఒకరికి బీజేపీ నుంచి అవకాశం దక్కనుంది. అయితే.. జిల్లా నేతలు.. స్థానిక క్యాడర్ అభిప్రాయానికి పెద్దపీట వేస్తే కడారి అంజయ్య యాదవ్.. ఇంద్రసేనారెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముందని టాక్.

Also Read: బ్రేకింగ్: తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

* త్వరలో భారీ బహిరంగ సభ
నాగార్జున సాగర్‌‌లోనూ దుబ్బాక రిజల్ట్ రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది. ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికల ఇన్‌చార్జీలుగా మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావును బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. మండల స్థాయిలో కూడా ఇన్‌చార్జీల నియామకం పూర్తి చేసింది. బీజేపీ లీడర్లు జనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలఇన్‌చార్జి తరుణ్ చుగ్ నాగార్జునసాగర్ సెగ్మెంట్‌లో పర్యటించి ఎన్నికలకు కేడర్‌‌ను సమాయత్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉండడంతో వారందరినీ ఇటీవలే పార్టీ స్టేట్చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడారు. అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ప్రధానంగా రెడ్డి, యాదవ కులాల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. అది కూడా టీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థి కులం ఆధారంగానే ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని వారు చెప్తున్నారు. త్వరలోనే సాగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఎన్నికల శంఖాన్ని పూరించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇప్పటికే గుర్రంపోడు గిరిజనుల తరఫున ఆందోళన చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ తన ఉనికిని నిలబెట్టుకుంది.

* భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం
నాగార్జుసాగర్లో గెలిస్తే పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అందుకోసమే కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను ఏఐసీసీ వాయిదా వేసింది. సాగర్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన సుమారు మూడు నెలలుగా సెగ్మెంట్‌లో ఉంటూ తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన కేడర్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సత్తా చూపించుకునేందుకు జానారెడ్డి గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

* బరిలో సీపీఎం
సీపీఎం నుంచి రైతు సంఘం నేత కున్‌రెడ్డి నాగిరెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పైకి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నా.. అసలు పోటీ మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాన్నిచ్చిన నాగార్జునసాగర్ ఓటర్లు.. ఈ ఉపఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.