Kinjarapu Atchannaidu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య నంద్యాలలో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో తదుపరి అరెస్టు ఎవరిదన్న చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తోంది. ఈ కేసులో ఏ 2 నిందితుడిగా అచ్చెన్నాయుడు ఉండడమే అందుకు కారణం. గతంలో ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
2015లో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సి మెన్స్ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. రూ. 371 కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకార్మిక శాఖ పరిధిలోకి వస్తుంది. అప్పట్లో ఆ శాఖను అచ్చెన్నాయుడు చూసేవారు. సహజంగానే ఆయనపై ఆరోపణలు వస్తాయి. అందుకే చంద్రబాబు ఏ1 కాగా.. అచ్చెన్నాయుడు ను ఏ 2 గా సిఐడి చూపింది. అయితే చంద్రబాబు అరెస్టుతో… అందరి దృష్టి అచ్చెన్నాయుడు పై పడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఎటువంటి సందడి లేదు. కార్యాలయం వద్ద సైతం పెద్దగా పోలీసుల హడావిడి లేదు. దీంతో ఆయన్ను ఇప్పుడు అరెస్టు చేయకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. అచ్చన్న అరెస్టు తప్పకుండా ఉంటుందని.. కానీ ఇప్పుడే చేస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని.. అందుకే ఏపీ సిఐడి ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. అయితే ఈఎస్ఐ కేసులో ఎదురైన పరిణామాలు అచ్చెన్నకు తెలుసు. అరెస్టు చేసి రోజంతా రాష్ట్రమంతా తిప్పిన వైనం కళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకే తాజా కేసులో తన అరెస్టు ఉంటుందని భయపడి.. అచ్చెన్నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.