KTR: ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కొడుకు డిఫ్యాక్టో ముఖ్యమంత్రి. డిఫ్యాక్టో ముఖ్యమంత్రిని.. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇక ముహుర్తమే తరువాయి అన్నట్టు ఊరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విరమించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఈసారైనా పట్టాభిషేకం పూర్తవుతుందా ? మునుపటిలాగే నిలిచిపోనుందా ? రాష్ట్రంలో ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటోడు అనేది కొంత మందికే తెలుసు. అందుకే కేటీఆర్ ను డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అంటారు. డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అంటే హక్కు లేకపోయినా సరే .. వాస్తవంగా పనిచేయడం అని అర్థం. కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టడానికి గతంలో ఒకసారి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి వాయిదా వేసుకున్నారు. దీనికి కారణం ఒక్క కేసీఆర్ కే తెలియాలి.
ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి పై మరోసారి చర్చ జోరుగా జరుగుతోంది. కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే ఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. అది ఏంటంటే.. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సాధారణంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి లేనిపక్షంలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రసంగిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. ధన్యవాద తీర్మానం పై కేసీఆర్ కు బదులు కేటీఆర్ ప్రసంగించారు. ఇప్పుడే ఇదే కేటీఆర్ పట్టాభిషేకం పై ప్రచారానికి కారణమైంది.

కేసీఆర్ బదులు కేటీఆర్ ప్రసంగించడంతో.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం వేగంగా జరుగుతోంది. కానీ దీనిని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం పై కేసీఆర్ ధన్యవాద తీర్మానం తెలిపాలి. కానీ కేసీఆర్ కు, గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విషయంలో తాను తగ్గేదిలేదన్న సంకేతాన్ని ఇచ్చేందుకే కేసీఆర్ .. కేటీఆర్ తో ధన్యవాద తీర్మానం పై ప్రసంగించేలా చేశారని బీఆర్ఎస్ నేతలు కొందరు చెబుతున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్తోందన్న ప్రచారం జరుగుతోంది. అదేమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.