Flood politics: “అజ్ఞానం బ్యారెళ్ళ లెక్కన అమ్మే వీలుంటే జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు నేనే కొనుక్కుంటా” ప్రముఖ అమెరికన్ రచయిత జిమ్ హై టవర్ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ పై వేసిన చురక ఇది. ఈ మధ్య వరదలు, వర్షాలపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే జిమ్ హై టవర్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తిస్వామ్యం ఎక్కువైపోయిన రోజులు ఇవి. ఇంజనీర్లను కాదని 80 వేల పుస్తకాలు చదివిన అనుభవం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దినాలు ఇవి. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పైగా లోపాలు తలెత్తేసరికి నిందారోపణలు చేయడం పరిపాటిగా మారింది. ప్రజాస్వామ్య దేశాల్లో ఇది సాధారణమైనప్పటికీ.. ఈమధ్య వెర్రి వేయి తలలు వేస్తోంది. ఎలాగూ తిరుగు సమాధానం ఉండదు కాబట్టి ఈ నెపాన్ని “క్లౌడ్ బరెస్టింగ్ అనో, క్లౌడ్ క్లోనింగ్” అనో ప్రకృతి పైకి నెపం వేస్తున్నారు. చుట్టూ వరదలున్నా.. మిన్ను మన్ను ఏకమయ్యేలా వర్షాలు కురుస్తున్నా.. రాజకీయ నాయకులు సోకాల్డ్ సమాచారంతోనే తమకు ఇష్టమైన దారిలోకి “మంద” ను మళ్లిస్తున్నారు. అదే కదా అసలైన పొలిటిషన్ల టెక్నిక్. అది విదేశీ కుట్రలవైపు కావచ్చు.. క్లౌడ్ బరెస్టింగ్ అయినా కావచ్చు. జనం “కళ్ల నిండా కాలేశ్వరం” చూసి కంగారుపడో.. కడుపుమండో విదేశీ కుట్ర అని ఒక మాట అనరా?!… బరాబర్ అంటారు. 80 వేల పుస్తకాలను మెదడులోకి ఎక్కించుకున్న జ్ఞానం విదేశీ కుట్ర అనే సరికి.. సోషల్ మీడియాలో సరుకు ఎలాగూ దిగింది. వాదోపవాదాలు, చర్చలు.. మొత్తానికి అసలు విషయం మరుగున పడింది.

అవి కూడా చైనా కుట్రలేనా?
ఈమధ్య బాగా అయిన పదం క్లౌడ్ బరెస్టింగ్. దానికి కారణం చైనా.. ఇదీ ఓ ప్రజా నాయకుడి ఉవాచ.
2004లో ఇండోనేషియాలో 9.1 – 9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది చనిపోయారు. ఇదంతా కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు పనేనని ప్రచారం అయింది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించేందుకే అమెరికా ఇలాంటి కుయుక్తులు పన్నిందని జనాలు కూడా బలంగా నమ్మారు. ఇప్పటంత స్థాయిలో సోషల్ మీడియా లేదు కనుక అమెరికా యుద్ధ నౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడు కూడా అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సోకాల్డ్ సిద్ధాంతాలకు పెయిడ్ మేధావులు వందలకొద్ది ఆధారాలు గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజం అనిపించేలా చేసింది. అంతెందుకు పాకిస్తాన్ కు చెందిన ఓ మేధావి రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని అనుమానించారు. అంతేనా పాకిస్తాన్ టార్గెట్ గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలు దానికి కారణమని మన వైపు వేలెత్తి చూపారు. చివరకు భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి ప్రచారం హోరెత్తించిన వారు ఉన్నారు. ఇలాంటి అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖాను పుంఖాలుగా జనం నెత్తిన రుద్దే వారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు. జస్ట్ “మిడి మిడి జ్ఞానం” ఉన్నవారు.
Also Read: Snake Island: మనుషులు ప్రవేశించలేని భూమిపై అత్యంత ప్రమాదకర పాములు ద్వీపం కథ తెలుసా?
స్వదేశీ వరద రాజకీయం
అవకాశం రావాలే గాని వరదలు, విపత్తులు, మహామ్మారులు… వేటినీ రాజకీయ నాయకులు వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతూ ఉన్నాయి. 2011 లో జపాన్ లో తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీని సృష్టించింది. 30 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడి ఫుకుషిమా పవర్ ప్లాంట్ లో అణు ప్రమాదానికి దారి తీశాయి. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ” యేహే ఇదంతా తప్పు. దీనికి ఇజ్రాయిల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం జపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనేనని” జపాన్లోని బాగా నమ్మినవారూ ఉన్నారు. పూర్తి విద్యావంతులు ఉన్న జపాన్లోనే పరిస్థితి ఇలా ఉందంటే.. మిగతా చోట్ల చెప్పాల్సిన పని లేదు.

థాయిలాండ్ లోనూ…
2011లో థాయిలాండ్ లో వచ్చిన వరదలు ప్రపంచంలో “నాలుగవ అతిపెద్ద నష్టం ” గా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు వచ్చాయి. జనవరి 2012 వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి అంటే నష్టం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ వరదలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనైంది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకు పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. 46.5 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇంత నష్టానికి కారణం ప్రకృతి ప్రకోపం అనే పాయింట్ పక్కకు పోయింది. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలోనే వరదలు వచ్చాయి కాబట్టి. ” తాను ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందని.. తర్వాత వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయి. వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయాలని, రాజకీయంగా తమను ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని” ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్ని రోజులపాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది. “అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాల పై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది.
ఆస్ట్రేలియాలోనూ
సిడ్ని.. ఆస్ట్రేలియాలో ప్రధాన నగరం. మొన్నటి వర్షాలకు కకావికలమైంది. అంటే 8 నెలల వర్షం నాలుగు రోజుల్లోనే దంచి కొట్టింది. ఫలితంగా పెను నష్టం వాటిల్లింది ఇంకేముంది రకరకాల సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ దాని కారణమని ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పినా ఆ వాయిస్ జనానికి చేరేలోపు లక్షల్లో యూ ట్యూబ్ వ్యూస్ నమోదయ్యాయి. విమానాలు, వింత ఆకారంలో ఉన్న మేఘాలు, రాడార్ చిత్రాలు సోషల్ మీడియాను కుమ్మేశాయి. ఇది ముమ్మాటికి తమపై ప్రభుత్వం వేసిన “వెదర్” బాంబే అని ప్రజలు నమ్మారు. ప్రపంచం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. నేటికీ కుట్ర కోణాల సిద్ధాంతాలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. జవాబుదారిగా ఉండాల్సిన నాయకులు తెలివిగా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి తోడు వారి అనుయాయులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అది మునిగిన కాలేశ్వరం ప్రాజెక్టు అయినా, కొట్టుకుపోయిన సిడ్నీ రోడ్లు అయినా, కకావికలమైన థాయిలాండ్ అయినా.. ప్రాంతాలు మాత్రమే వేరు.. నష్టం తీవ్రత మాత్రం ఒకటే. వీటన్నింటికీ కారణం మానవ చేష్టలే అని తెలుసుకోకపోవడం బాధాకరం.
Also Read:India Population: 41 కోట్ల కోత.. దారుణంగా పడిపోనున్న భారత జనాభా