Independence celebrations 2025: బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947లో విముక్తి పొందింది. అప్పటినుంచి దేశ ప్రజలు ఎంతో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. తమకు నచ్చిన వ్యాపారం.. ఉద్యోగం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. స్నేహితులతో, కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే భారతదేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ సగటు భారతీయుడు ఆర్థిక స్వాతంత్రం పొందలేకపోతున్నారు అని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటి? నిజమైన ఫ్రీడమ్ ఇదే అని ఎందుకు కొందరు అంటున్నారు?
ప్రస్తుత కాలంలో మనిషి జీవితాన్ని డబ్బు నడిపిస్తుందని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏ పని మొదలుకాదు.. పూర్తికాదు. అయితే సగటు భారతీయుడు ఆ డబ్బులు క్రమ పద్ధతిలో ఉపయోగించుకోకపోవడం వల్లే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. ప్రతి పౌరుడు తన జీవితం నడవడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. అయితే అత్యాశ, స్వార్థం, ప్రణాళిక లేకపోవడం వల్ల ఆదాయం కంటే అప్పులు పెరిగిపోయి ఆర్థిక చిక్కుల్లో పడి స్వేచ్ఛ పొందలేకపోతున్నాడు.
ఒక వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న సందర్భంలో అతడు ఏదో రకమైన ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ సమస్య రావడానికి అతను డబ్బులు సరైన ప్రణాళిక విధంగా ఖర్చు చేయలేకపోవడమే అని తెలుపుతున్నారు. మనకు వచ్చే ఆదాయం ఎంత? మనం ఎంత ఖర్చు పెట్టాలి? ఎలాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి? ఏ అవసరాలను ముందుగా తీర్చుకోవాలి? అనే విషయాలను బేరీజు చేసుకొని ప్రణాళిక బద్దంగా ముందుకు వెళితే ఆదాయం ఖర్చులకు సమతుల్యం ఉంటుంది. అలాకాకుండా వచ్చిన ఆదాయం తక్కువగా ఉండి.. ఖర్చులు, కోరికలు ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుల పాలు కావడం ఖాయమని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్ష రూపాయల ఆదాయం వచ్చిందని అనుకున్నాం. ఈ ఆదాయంలో ముందుగా ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. 50 శాతాన్ని పక్కకు పెట్టుకోవాలి. అంటే ఇంటి అద్దె, వంట సరుకులు, వీకెండ్ ఖర్చులు, ఆస్పత్రి ఖర్చులు వంటివి ఇందులో ఉంటాయి. మిగతా 25 శాతం పెట్టుబడుల కోసం వెచ్చించాలి. మరో 25 శాతం ప్రత్యేక అవసరాల కోసం ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే వారికి వచ్చే ఆదాయం ప్రకారం ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఆర్థిక సమతుల్యత ఉంటుంది.
అయితే కొందరు వారికి వచ్చిన ఆదాయంలో 50 శాతం ఖర్చులకు ఉపయోగించినా.. మిగతా 50% లో పెట్టుబడుల కోసం కాకుండా విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్నారు. అంటే గాడ్జెట్స్, వెహికల్స్ వంటి ఉంటున్నాయి. అయితే ఇవి అవసరం ఉంటే పర్వాలేదు.. కానీ వారి ఆదాయానికి తగిన విధంగా కొనుగోలు చేయడం మంచిది. అలా కాకుండా తక్కువ ఆదాయం వచ్చేవారు ఎక్కువ ధరకు వీటిని కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మరికొందరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తారు. కానీ అలా చేస్తే ఈఎంఐ చెక్కులో పడిపోతారు. ఉద్యోగం చేసేవారు ఎవరైనా చేతిలో సరిపడిన ఆదాయం వచ్చిన తర్వాతే కొనుగోలుకు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది.