Chandrababu Jail: చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఎవరైనా ఊహించారా? పోనీ అరెస్ట్ అయినా..రిమాండ్ ఉంటుందని భావించారా? ఒకటి కాదు రెండు కాదు పది రోజులు పాటు జైలులో ఉండిపోతారని అంచనా వేశారా? విచారణలు, తీర్పులకు సంబంధించి ఇన్ని వాయిదాలు ఉంటాయని అనుకున్నారా? కానీ ఇవన్నీ చేసి చూపించారు. అసలు ఎఫ్ ఐ ఆర్ కూడా లేకుండా అరెస్టు చేయగలిగారు. అదే స్పీడ్ తో రిమాండ్ విధించగలిగారు. కానీ చంద్రబాబు న్యాయబద్ధంగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం అంత వేగంగా రావడం లేదు. దాని వెనుకున్న కథ, కమామీషు ఎవరికీ తెలియడం లేదు.
చంద్రబాబుకు రిమాండ్ విధించి రెండు వారాలు దాటుతోంది. క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం కి వాయిదా వేశారు. అయినా తీర్పు వెల్లడిస్తారో లేదో తెలియని పరిస్థితి. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై కౌంటర్ కు వారం రోజుల సమయం తీసుకున్నారు. ఈ వారం రోజులపాటు దేశవ్యాప్తంగా డిబేట్ లలో పాల్గొన్నారు. అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ కోర్టులో చంద్రబాబు ఏం తప్పు చేశారో మాత్రం చెప్పడం లేదు. కేవలం రిమాండ్ రిపోర్టును మాత్రం చదివి వినిపిస్తున్నారు.
చంద్రబాబుపై పాత కేసులను తిరగదోడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేసులను తెరపైకి తెచ్చారు. కేసు తీర్పులు వాయిదా పడుతున్నాయి. మరోసారి వాయిదా పడతాయని కూడా ఏకంగా నేషనల్ మీడియాకు లీకులు ఇస్తున్నారు. కానీ అధికారిక సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. ఏసీబీ కోర్టులో బెయిల్, అటు కస్టడీ పిటిషన్ల పై విచారణలు వాయిదా పడుతున్నాయి.క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఉండడంతో.. ఆ అవన్నీ పక్కకు వెళ్తున్నాయి. క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాతే.. బెయిల్, కస్టడీ పిటిషన్ల పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు చెబుతోంది.
ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. అంగళ్ళ కేసులో మిగతా నిందితులందరికీ ముందస్తు బెయిల్ లభించింది. కానీ చంద్రబాబు బెయిల్ కి సంబంధించి ఈరోజు విచారణ జరగనుంది. అసలు చంద్రబాబు కేసుల విషయంలో ఏం జరుగుతుందో సామాన్యులకు అంతు పట్టడం లేదు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి మాత్రం కాస్త క్లారిటీ ఉంది. అయితే కోర్టు కేసులు, విచారణలు, వాయిదాలు తీరును చూస్తుంటే ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సి.బి.ఐ, ఈడికి అప్పగించాలని కోరుతున్నారు. దీంతో ఈ కేసులు కొత్త మలుపు తిరగడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.