Pawan Kalyan: జన సైనికులు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా తమ లక్ష్యం నెరవేరడం లేదు. సీఎంగా పవన్ ను చూడాలన్నది సగటు జన సైనికుడు అభిమతం. 2014లో నెరవేరలేదు. 2019లో సైతం దక్కలేదు. 2024లో సైతం అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో జనసైనికులు ఓ రకమైన ఆవేదనతో ఉన్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికలకు ముందు పవన్ జనసేన ను స్థాపించారు. అయితే అప్పటికే ఎన్నికలు సమీపించడంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో పవన్ అనుకున్నది సాధించారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు ఖుషి అయ్యారు. దీంతో జనసేన బలపడుతుందని ఆశించారు. కానీ ఐదు సంవత్సరాల సంస్థాగతంగా బలోపేతం అయ్యేలా కనీస ప్రయత్నం జరగలేదు. కనీసం నియోజకవర్గ నాయకులను సైతం తయారు చేసుకోలేదు. 2019 ఎన్నికల నాటికి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. బిజెపితో తెలుగుదేశం విభేదించింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. జనసేన సైతం ఒంటరి పోరుకు మొగ్గు చూపింది. అయితే ఆ ఎన్నికల్లో మూడు పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి.
అయితే 2019 ఎన్నికల్లోఎదురైన పరాజయాన్ని పవన్ గుణపాఠంగా మలుచుకోలేదు. మళ్లీ బిజెపికి దగ్గరయ్యారు. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. అది కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారు. బిజెపి స్నేహాన్ని పూర్తిస్థాయిలో పొందలేకపోయారు. అటు బిజెపికి మిత్రపక్షంగా ఉంటూనే.. తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందించారు. పోనీ తెలుగుదేశం నుంచి ఏమైనా సింహప్రయోజనాలు పొందారంటే అది లేదు. పొత్తుల్లో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ స్థానాలకు పరిమితమయ్యారు. ఈ తక్కువ స్థానాలతో పవన్ ను సీఎం హోదాలో చూసుకోవాలన్న జనసైనికుల ఆశలు నీరుగారిపోయాయి. పవన్ వెంట నడిచిన నాయకులు నిరాశకు గురయ్యారు. అంతిమంగా అది పొత్తు విచ్ఛిన్నానికి దారితీస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 15 సంవత్సరాల కుర్రాడి నుంచి 50 సంవత్సరాల నడివయస్కుడి వరకు పవన్ అభిమానులే. పవన్ పార్టీ పెట్టిన నాటికి 15 ఏళ్ల యువకుడు.. నేడు 25 ఏళ్లకు చేరుకున్నాడు. 25 సంవత్సరాల యువకుడు 40 ఏళ్లకు చేరుకున్నాడు. ఇలా వారి వయసు మారుతుందే తప్ప.. వారు అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. పవన్ సీఎం గా చూడాలన్న వారి అభిమతం నెరవేరడం లేదు. పవన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారన్న కోరిక తీరడం లేదు. ఇదొక్కటే జనసైనికుల్లో ప్రధానమైన అసంతృప్తి. కానీ ఏవేవో లెక్కలు చెప్పి పవన్ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అధినేత పై అభిమానం తగ్గని వారు సైలెంట్ అవుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో తాము అనుకున్నది అసాధ్యమని భావిస్తున్న వారు బ్లాస్ట్ అవుతున్నారు. మొత్తానికైతే జన సైనికుల కోరిక ఇప్పట్లో నెరవేరే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.