Moinabad Farm House Deal: అందరూ అనుకున్నట్టుగానే మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. నిన్న రాత్రి మొయినాబాద్ మండలం అజిజ్ నగర్ లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన రచ్చ రచ్చ చేస్తున్నది. ఇవాళ సాయంత్రం వరకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇంత జరిగాక సమాధానం లేని కొన్ని ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి.

ఇంతకీ అవి ఏంటంటే
కేవలం నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికిప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. ఆ ప్రమాదం ముంచుకొచ్చినా కాపాడేందుకు మజ్లీస్ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికిప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో మునుగోడు ఉప ఎన్నికల్లో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఎదురీదుతున్నారు. ఒకవేళ అంత భారీ రేట్లతో బిజెపి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఒకవేళ కొనుగోలు చేసినా వారితో రాజగోపాల్ రెడ్డి మాదిరి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తుంది. ఒక్కొక్కరికి 100 కోట్లు ఆట? నలుగురికి కలిపి అడ్వాన్సుగా 15 కోట్ల అట!మమ్మల్ని కొనందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేలే ఫోన్ చేసి పోలీసులను రమ్మన్నారట! అప్పటికే టీవీ ఛానళ్లు ఆ పరిసరాల చేరి రికార్డింగ్ లు చేసుకుంటున్నాయట! ఈ పోలీసు స్క్రిప్ట్ ఏమైనా నమ్మశక్యంగా ఉందా? తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ కొనుగోలు ఎవ్వరం మాకేం తెలియదని మీడియాతో చెప్పారు. మరి పోలీసులకు సమాచారం ఇచ్చి మరి ఆపరేషన్ భగ్నం చేసిన వాళ్లు అలా ఎందుకు చెబుతున్నట్టు? చివర్లో ఒక ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడటంతో వ్యవహారం బెడిసి కొట్టిందని కొన్ని పత్రికలు రాశాయి. అసలు ఎందుకు అలా చేసినట్టు? ఆ అనుమానాలు ఎందుకు వ్యక్తం చేసినట్టు?
డబ్బు నిజంగా దొరికిందా
ఈ వ్యవహారంలో డబ్బు దొరికిందని వార్తలు వస్తున్నాయి. నిజంగా డబ్బు దొరికితే పోలీసులు గనుక దానిని చూపిస్తే ఈడీ యో, సీబీఐ యో, అవసరం అయితే ఎన్ఐఏ యో ఎంటర్ అయితే కదా ఆ డబ్బు సోర్స్ ఏమిటో? ఏ ఖాతాలనుంచి వచ్చిందో తేలుతుంది. అబ్బే ఆ డబ్బు దొరికిందని ఎవరు చెప్పారు అని పోలీసులు మీడియాను ఉల్టా ఆడుతున్నారు.

ఇక వాళ్ళు ఎవరో స్వాములట! ఈ కొనుగోలుకు తెగబడ్డారు సరే.. వాళ్లు కిషన్ రెడ్డికి సన్నిహితులట సరే. ఈ చేరికల కమిటీకి బాధ్యుడు ఈటల రాజేందర్. కొత్తగా కిషన్ రెడ్డికి ఈ బాద్యతలు ఎవరు ఇచ్చారు? ఫో, పోయి ఫలానా చోట ఎమ్మెల్యేలు ఉంటారు, కొనుక్కు రా పో, వారిలో ముగ్గురు ఆల్రెడీ గెలిచిన పార్టీ తెప్పలు తగిలేసి వచ్చిన వాళ్లే! అని చెప్పగానే బ్రోకర్ స్వాములు వందల కోట్ల నోట్ల కట్టలని గోనె సంచుల్లో కట్టుకొని బయల్దేరారా? పోనీ వారిని ఒక్కొక్కరిని 100 కోట్లకు కొనే సీన్ ఉందా? 400 కోట్లు పెడితే ఏకనాథ్ షిండే రేంజ్ లోనే దొరుకుతారు కదా. ఇక దొరికిన వాళ్లంతా బిజెపికి సన్నిహితులని ఎస్టాబ్లిష్ చేసేందుకు టిఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా విపరీతంగా ప్రయత్నించాయి. బోలెడు వీడియోలు, ఫోటోలు గుప్పించాయి. ఇక బాల్క సుమన్ లాంటి నేతలు అయితే నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు.
ఇంత జరిగాక లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరి అరెస్టు లు ఎలా చేసినట్టు? ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీద మాత్రమే కేసు ఎందుకు కేంద్రీకృతమైనట్టు? ఇంత సీరియస్ ఇష్యూ ని వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఇంకా బెటర్ కదా! కెసిఆర్ బిజెపిని ఇంకా కార్నర్ చేయొచ్చు. కానీ కెసిఆర్ అలా చేయడు. కెసిఆర్ ప్రతి శ్వాస లోనూ రాజకీయమే ఉంటుంది. తాజా మొయినాబాద్ ఎపిసోడ్ లోనూ ఇదే జరిగింది.