Pawan Kalyan Meet Amit Shah: పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసింది ఏపీ రాజకీయాల కోసమా? తెలంగాణ రాజకీయాల కోసమా? అసలు పవన్ తో అమిత్ షా ఏం చర్చించారు? పవన్ అమిత్ షా కు ఏం చెప్పారు? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తో పవన్ భేటీ తర్వాత అసలు ప్రత్యేక ప్రకటన విడుదల కాలేదు. ఏ అంశంపై చర్చించారో కూడా వెల్లడించలేదు. ఈ చర్చల్లో సానుకూలత ఉంటే ఈపాటికే బయట పెట్టి ఉండేవారు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబు అరెస్టు తరువాత బిజెపి పెద్దలను కలిసి ఏపీ పరిస్థితిని వివరిస్తానని పవన్ ప్రకటించారు. కానీ తర్వాత అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగలేదు. ఇన్నాళ్లకు పవన్ అమిత్ షా ను కలుసుకున్నారు. అయితే అది బిజెపి ప్రయోజనం కోసమా? తెలంగాణలో పొత్తుల కోసమా? అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పవన్ ను ఢిల్లీ తీసుకెళ్లారు. దీంతో తెలంగాణలో పొత్తుల కోసమేనని ప్రచారం జరుగుతోంది.అయితే అది తెలంగాణలో పొత్తుల కోసం కాదని.. ఏపీ రాజకీయాల కోసమేనని చర్చ నడుస్తోంది.
మొన్నటికి మొన్న లోకేష్ సైతం అమిత్ షాను కలిసారు. అమిత్ షా కోరిక మేరకే తాను కలిసినట్టు లోకేష్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడం వల్లే తాను కలవగలిగానని చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ పది రోజులు ముందే అపాయింట్మెంట్ కోరారని.. తీరిక లేకపోవడం వల్లే అమిత్ షా కలవలేకపోయారని.. తీరిక దొరకడంతో తన ద్వారా కబురు పంపారని కిషన్ రెడ్డి తరువాత చెప్పారు. అయితే ఇప్పుడు పవన్ విషయంలో అలానే జరిగి ఉంటుందా? పవన్ అపాయింట్మెంట్ కోరారా? లేక అమిత్ షా నే కోరారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణ గురించి అయితే ఈ స్థాయిలో చర్చలు జరగనక్కర్లేదు. అసలు తెలంగాణ విషయంలో జనసేనకు పెద్దగా అంచనాలు లేవు. అది ముమ్మాటికి ఏపీలో పొత్తుల వ్యవహారం గురించి పవన్ అమిత్ షా ను కలిసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు పవన్ కు ఏపీ కీలకము. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. అదే సమయంలో ఎన్డీఏ కు భాగస్వామిగా ఉన్నారు. బిజెపిని తెలుగుదేశం కూటమిలో చేర్చడం ఒక లక్ష్యం.. అదే టిడిపిని ఎన్డీఏలో చేర్చడం మరో లక్ష్యం. దీనికోసమే ఆయన ప్రత్యేకంగా అమిత్ షాను కలిసి ఉంటారని.. ఆ ప్రతిపాదనతోనే తెలంగాణ ఎన్నికల్లో మద్దతు అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మూడు పార్టీల మధ్య పొత్తు విషయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.