KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి సరిగ్గా నెల రోజుఅయింది. నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు గద్దె దించారు. కాంగ్రెస్‌క పట్టం కట్టారు. నెల రోజు తర్వాత నాటి ముఖ్యమైన మంత్రి, నేడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల తారాకరామారావు జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచారు. డిసెంబర్ 31 సందర్భంగా ప్రత్యేక పార్టీ ఇచ్చారు. వారితోనే కలిసి భోజనం చేశారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ మార్పు చూసి తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు. ఇందతా మార్పే… నెల రోజులకే మొత్తం మారిపోయారా? అసెంబ్లీ ఎన్నికల రిజల్డ్ ఎఫెక్ట్ ఇంత బాగా పనిచేసింది.. లేక..రాబోయే లోక్‌సభ ఎన్నికల ట్రిక్కా అని సందేహిస్తున్నారు.
నాడు కలవడమే కష్టం..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పెరిగిన దూరమే. ప్రజల సంగతి దేవుడెరుగు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవావి కావు. ఇక సామాన్యుడైతే అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనమైనా కాస్త కష్టపడితే దొరుకుతుంది.. కానీ, కేసీఆర్ దర్శనం ఆయన అనుకుంటేనే దొరుకుతుంది. లేదంటే అంతే. పదేళ్ల పాలనలో సామాన్యులను ఒక్క రోజు కూడా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు.
కంచె బద్ధలు కొట్టి..
ఏ దూరమైతే ప్రభుత్వ పతనాన్ని శాసించి కాంగ్రెస్‌ను నిలబెట్టిందో.. ఆ దూరాన్నే తొలగించేందు రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రారంభించారు. ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే.. ప్రగతిభవన్ ఎదుట ఉన్న కంచెను సిబ్బంది తొలగించారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రగతి భవన్‌ను సీఎం రేవంత్ ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజావాణి కార్యక్రమం చేపట్టి ప్రజలందరూ వచ్చే అవకాశం కల్పించారు. సమస్యలే లేవని చెప్పిన గత పాలకులు ఆశ్చర్యపోయేలా ప్రజలు ప్రజాభవన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. దీంతో గత ప్రభుత్వం హయాంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలుస్తోంది.
అప్రమత్తమైన కేటీఆర్..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుండడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన జీహెచ్‌ఎంసీలో పట్టు కోల్పోకుండా, లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం బీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బీఆర్‌ఎస్ కార్యాలయానికి పారిశుధ్య కార్మికులను ఆహ్వానించి కేటీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. సమాన్యులను దూరం పెడితే.. ఎన్నికల సమయలో సామాన్యులు బీఆర్‌ఎస్‌ను దూరం పెట్టారు. దీంతో అందరికీ దరగ్గరా ఉండాలన్న ఆలోచన కేసీఆర్, కేటీఆర్‌కు తెలిసొచ్చింది. లేదంటే లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్టే వస్తుందన్న ఆందోళన గులాబీ నేతల్లో నెలకొంది. అందుకే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. అయితే ఓడిపోయిన నేతలు మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. గెలిచిన నేతలు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు.