Mamata Benerjee : ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. ఈ సామెతను మమతా బెనర్జీ మళ్లీ నిజం చేసి చూపిస్తున్నారు..

ఎమోషనల్ పాలిటిక్స్ చేసే మమత.. మరోసారి అదే పల్లవి అందుకుంది. జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటనలో బాధ్యులైన వారికి ఆగస్టు 17 అంటే ఆదివారం లోపు ఉరిశిక్ష విధించాలని కేంద్ర దర్యాప్తు బృందం అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 16, 2024 7:10 pm

West Bengal CM Mamata Banerjee

Follow us on

Mamatha Benerjee: వెనకటికి ఓ తేడాగాడైన దొంగ.. ఒక దొంగతనం చేసి.. పట్టుకునేందుకు వచ్చిన దొంగలను తరిమి తరిమి కొట్టాడట. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. వాస్తవానికి ఈ మాట చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఇంతకుమించి ఉన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్ ప్రాంతంలో సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో వందలాదిమంది మహిళలపై తృణ మూల్ కాంగ్రెస్ నాయకులు అకృత్యాలకు పాల్పడ్డారు. లైంగిక దాడులకు యత్నించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాపై వారు దాడులకు పాల్పడ్డారు. వాస్తవానికి బాధిత మహిళల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం.. వారినే ఇబ్బందులకు గురిచేసింది. ఎన్నికల కాలం కావడంతో ఓ వర్గం వారిని ఆకట్టుకునేందుకు మమతా బెనర్జీ ఈ ఘటనకు మతంరంగు పులిమింది. ఫలితంగా అది కాస్త రచ్చ రచ్చ అయింది. దీంతో బాధిత మహిళల ఆర్త నాదాలు అరణ్య రోదనగా మిగిలిపోయాయి.

ఏకంగా సిబిఐ అధికారులను నిర్బంధించిన ఘనత

సందేశ్ ఖాళీ ఘటనకు ముందు పశ్చిమ బెంగాల్లో శారదా స్కాం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అక్కడి అధికార పార్టీ నాయకులు పీకల్లోతులో కూరుకు పోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ కేసులు నమోదు చేసింది. విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళింది. అయితే వారిని విచారణ జరపనీయకుండా మమత ప్రభుత్వం అడ్డుకుంది. ఏకంగా వారిపై ఉల్టా కేసులు పెట్టింది. వారిపై దాడులు కూడా చేయించింది. చివరికి కేంద్ర మంత్రిపై కూడా హింసకు పాల్పడింది. ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో సిబిఐకి ఎర్రజెండా చూపింది. అంతేకాదు కేంద్రంపై తీవ్రస్థాయిలో మమతా బెనర్జీ విమర్శలు చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ తమవైపు మళ్ళే విధంగా సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. అక్కడిదాకా ఎందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో.. కాలుకు కట్టుకట్టుకుని మమతా బెనర్జీ ఎన్నికల స్టంట్ ప్రదర్శించింది. ఇక ఇటీవల ట్రెడ్ మిల్ పై జాగింగ్ చేస్తుంటే నుదుటికి గాయమైందని.. తన నుదుటిపై రక్తపు బొట్టు కారుతున్న దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మమతా బెనర్జీ నెత్తి మాసిన రాజకీయాలు వేలల్లో ఉంటాయి.

గొప్పగా ఉందని పదే పదే చెబుతుంటారు

తన పరిపాలనలో బెంగాల్ రాష్ట్రం గొప్పగా ముందుకు సాగుతోందని మమతా బెనర్జీ పదే పదే చెబుతుంటారు. చివరికి బంగ్లాదేశ్ ముస్లింలకు తన రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పనికిమాలిన హామీలు ఇస్తూ ఉంటారు. రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి, భారత పౌరసత్వం కల్పించి.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని శరణార్థి ప్రాంతంగా మార్చేస్తుంటారు. ఇలాంటి నీతి బాహిల్య రాజకీయాలు చేసే మమతా బెనర్జీ.. మణిపూర్ లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తుంటారు. ప్రధానమంత్రిని దిగి పోవాలని డిమాండ్ చేస్తుంటారు. అని తన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తే వారి గొంతులను నొక్కిస్తుంటారు. చివరికి తాను ఒక మహిళ అయి ఉండి కూడా.. ఒక బాధిత మహిళ పక్షాన వీసమెత్తు మాట కూడా మాట్లాడరు.

సుప్రీంకోర్టు చెప్పినా.. అర్థం కాదా

కోల్ కతా లోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఓ జూనియర్ వైద్యురాలు ఇటీవల హత్యాచారానికి గురయ్యారు. ఈ క్రమంలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. అయితే ఆసుపత్రిలో ఆ ఘటనకు సంబంధించిన ఆధారాలు చెరిపి వేసేందుకు గత బుధవారం 40 మంది ముఠా సభ్యులు విధ్వంసం సృష్టించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఎమోషనల్ పాలిటిక్స్ చేసే మమత.. మరోసారి అదే పల్లవి అందుకుంది. జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటనలో బాధ్యులైన వారికి ఆగస్టు 17 అంటే ఆదివారం లోపు ఉరిశిక్ష విధించాలని కేంద్ర దర్యాప్తు బృందం అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తాను కోల్ కతా వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తానని బెదిరించారు. ఇదే విషయాన్ని తన పార్టీ ఎంపీ ద్వారా మమత చెప్పించింది. ఈ కేసులో విచారణను కోల్ కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. మూడు వారాల్లో కేసు విచారణ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ విషయం తెలిసి కూడా మమతా బెనర్జీ.. తన డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఈ ఘటనలో కేంద్రానిదే తప్పు అనే సంకేతాలు ఇచ్చేందుకు నిరసన ర్యాలీ బాట పట్టింది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో సత్తా ఉంటే.. అక్కడ పోలీసులు పకడ్బందీగా పని చేస్తే.. కేసు సిబిఐ దాకా ఎందుకు వెళ్తుంది? గుర్తుతెలియని వ్యక్తులు వైద్యులపై ఎందుకు దాడి చేస్తారు? ఇదే సమయంలో బెంగాల్ ప్రజలను తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమత ఇంకెన్ని రోజులు పిచ్చోళ్లను చేస్తారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.