CEEW Report Waste Economy: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యను చాలా మంది భారంగా చూస్తుంటే.. అది భవిష్యత్తులో భారీ ఆర్థిక అవకాశంగా మారబోతోందని CEEW (Council on Energy, Environment and Water) తాజా అధ్యయనం వెల్లడించింది. వంటగది వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, పూలు, మాంసం అవశేషాలు, ఉద్యానవన వ్యర్థాలు వంటి సేంద్రియ చెత్తను సమర్థంగా నిర్వహిస్తే 2047 నాటికి దాదాపు 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లకు పైగా) మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత లక్ష్యానికి చెత్త సమస్య ఆర్థికంగా కీలకంగా మారవచ్చని CEEW అధ్యయనం తెలుపుతోంది . ప్రస్తుతం భారత నగరాలు ప్రతిరోజూ సుమారు 1.71 లక్షల టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో దాదాపు సగం సేంద్రియ వ్యర్థాలే. నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాల పరిమాణం ఏటా సుమారు 208 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో ప్రాసెస్ చేస్తే కంపోస్ట్.. బయోగ్యాస్, బయో-సీఎన్‌జీ, సేంద్రియ ఎరువులు వంటి విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చు. దీంతో ఒకవైపు చెత్త సమస్య తగ్గడమే కాకుండా మరోవైపు స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు లభిస్తాయి. దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చని నివేదిక చెబుతోంది.
ఉద్యోగాల పరంగా కూడా ఈ రంగం భారీ అవకాశాలను కలిగి ఉంది. అనుకూల విధానాలు అమలైతే 2047 నాటికి సేంద్రియ వ్యర్థాల నిర్వహణ రంగంలో సుమారు 26 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని CEEW అంచనా వేసింది. వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్లాంట్ల నిర్వహణ, సాంకేతిక సేవలు, బయోగ్యాస్ ఉత్పత్తి, ఎరువుల తయారీ వంటి అనేక విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.
పర్యావరణ పరంగా కూడా ఈ మార్పు ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చెత్తను బహిరంగంగా కాల్చడం వల్ల నగరాల్లో హానికరమైన PM2.5 కాలుష్యంలో దాదాపు 10 శాతం వరకు వాటా ఉందని అధ్యయనం పేర్కొంది. అలాగే సేంద్రియ వ్యర్థాలు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోవడం వల్ల మీథేన్ వంటి హరిత గృహ వాయువులు విడుదలవుతున్నాయి. వీటిని ప్రాసెస్ చేయడం ద్వారా గాలి కాలుష్యం, దుర్వాసన, అగ్ని ప్రమాదాలు, భూగర్భ జలాల కలుషితాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
అధ్యయనం ప్రకారం.. సరైన విధానాలతో 95 శాతం పట్టణ సేంద్రియ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేయగలిగితే 2047 నాటికి సుమారు 68 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి కొనసాగితే వ్యర్థాల రంగం నుంచి వెలువడే ఉద్గారాలు మరింత పెరిగి 120 మిలియన్ టన్నుల స్థాయికి చేరవచ్చని హెచ్చరించింది.
ఈ రంగం అభివృద్ధికి సుమారు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని CEEW పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, గ్రీన్ బాండ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్లు వంటి వినూత్న ఆర్థిక విధానాలను ప్రోత్సహించాలని సూచించింది. అలాగే చెత్తను ఇంటి వద్దే వేరు చేయడం, నగరాల స్థాయిలో ఖచ్చితమైన డేటా సేకరణ, నాణ్యత ఆధారిత ఒప్పందాలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వంటి అంశాలు విజయానికి కీలకమని తెలిపింది.
ఇప్పటివరకు పర్యావరణ సమస్యగా భావించిన చెత్తనే భారత్ భవిష్యత్తులో ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. సరైన విధానాలు, సాంకేతికత, పెట్టుబడులు అందుబాటులోకి వస్తే చెత్త కుప్పలు ఉద్యోగాలు, ఆదాయం, స్వచ్ఛమైన ఇంధనం, పరిశుభ్రమైన నగరాలకు మార్గం చూపే ‘గ్రీన్ ఎకానమీ’ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
