MP Vijayasai Reddy: విశాఖలో భూకబ్జా ఆరోపణలతో ఉక్కిబిక్కిరి అవుతున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి మూడురోజులుగా ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడ్డారు. చివరకు మంగళవారం మీడియా ముందుకొచ్చారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు సామాజికవర్గం, సొంత మీడియా ఏర్పాటు వంటి పొంతన లేని సమాధానాలు చెప్పారు. అవినీతిపై పక్కా ఆధారాలతో విపక్షాలు బయటపడితే ఆయన మాత్రం రోటీన్ మాటలు చెప్పి రోత పుట్టించారు. కొందరు మంత్రులు అయితే విజయసాయిరెడ్డి మీడియా ముందుకొస్తారు. అన్నింటికీ సమాధానం చెబుతారు అని చెప్పుకొచ్చారు. తీరా మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి అటు తిప్పి ఇటు తప్పి భూ దందాలు చేస్తే తప్పేంటి అన్న మీనింగు వచ్చేలా మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను ఉత్తరాంధ్రపై కుట్రకు లింకు పెడుతూ మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తిన ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. తనకు అచ్చొచ్చిన ఎదురుదాడిని అస్త్రంగా ఎంచుకున్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సొంత మీడియాను సైతం ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు.

ప్రధానంగా విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు దసపల్లా భూముల ఆరోపణలు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై ప్రశ్నించారు. అయితే దసపల్లా భూములు ప్రవేటు వ్యక్తులవని విజయసాయిరెడ్డి తాజాగా తేల్చేశారు. అందుకే 22ఏ జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించారు. అసలు సిసలు ప్రభుత్వ ప్రతినిధిలా మాట్లాడేశారు. ఎన్నికలకు ముందు దసపల్లా భూములను టీడీపీ నేతలు కబ్జా చేయడానికి ప్రయత్నించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని వైసీపీ నేతలు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చాక సీన్ మార్చారు. గోపీనాథ్ రెడ్డి అనే బినీమా పేరిట 75 శాతం భూములను విజయసాయిరెడ్డి కొల్లగొట్టారన్నది విపక్షాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ దీనిపై విజయసాయి మాత్రం నేరుగా సమాధానం ఇవ్వడం లేదు.

సాగర నగరమంటే తనకిష్టమని.. విశాఖలో నివాసం ఏర్పాటుచేసుకోవాలని ఉందని విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తప్పించి ఎటువంటి ఆస్తులు లేవని కూడా ప్రకటించారు. అల్లుడు, కుమార్తె ఎటువంటి వ్యాపారాలు చేయలేదని కూడా సెలవిచ్చారు. ఇప్పుడు అల్లుడు, కుమార్తె కంపెనీల అక్రమ లావాదేవీలను ఆధారాలతో బయటకు తీస్తే మాత్రం వారితో తనకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. వారు ఎప్పటి నుంచో వ్యాపారాలు చెసుకుంటున్నారని చెబుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు రోడ్డు ఎలైన్ మెంట్ అల్లుడి, కూతరు ఆస్తులున్న ప్రాంతం పక్క నుంచి మార్చారన్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ బ్రాహ్మణి ఆస్తులు కొనుగోలు చేస్తే బాలక్రిష్ణకు ఏం సంబంధమని కొత్త లాజిక్ ను ప్రదర్శించారు.
అయితే ఈ ఆరోపణలన్నీ రామోజీరావు మీడియా చలువేనని విజయసాయి చెప్పుకొచ్చారు. అందుకే తన సొంత డబ్బుతో తానే సొంత మీడియా పెడతానని కూడా ప్రకటించారు. రామోజీరావు అయినా.. రాధాకృష్ణ అయినా సొంత డబ్బులతోనే మీడియా పెడతారు. ఒక్క సాక్షి మీడియా తప్పించి అందరూ సొంతంగానే మీడియాలను ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు రామోజీరావు పేరు చెప్పి విజయసాయి సాక్షి మీడియాపై అక్కసు ప్రదర్శించినట్టున్నారు. అయితే తన అక్రమాలకు కొమ్ముకాయలేదని.. అడ్డగోలుగా వాదించలేదని సాక్షి పత్రికపై ఓకింత కోపం పెంచుకున్నట్టున్నారు. అందుకే సొంత మీడియా అంటూ స్వపక్షీయులకే సంకేతాలు పంపారు. అయితే మరో అడుగు ముందుకేసి దసపల్లా భూములను 22ఏ ను తీసివేయడం లాభపడింది చంద్రబాబు సామాజికవర్గం అని కొత్త లాజిక్ చెప్పారు. మొత్తానికైతే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ తో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతుగా వైసీపీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రజలు తిరిగి అధికార పార్టీపై అనుమానపు చూపులు చూడడం ప్రారంభించారు.