Jagan- Vijayamma And Sharmila: ఏపీ రాజకీయాలతో జగన్ ముప్పు తిప్పలు పడుతున్నారు. పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత ఒక వైపు.. విపక్షల దూకుడు మరోవైపు జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రూపంలో ఎదురువుతున్న సవాళ్లు… చంద్రబాబు వ్యూహాలు..బీజేపీ స్ట్రాటజీ అర్ధం కాక ఏంచేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సోదరి షర్మిళ, తల్లి విజయలక్ష్మి చర్యలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఏపీ రాజకీయాలను తట్టుకోలేని స్థితిలో ఉన్న జగన్ కు ఇప్పుడు చెల్లీ తల్లీ రూపంలో ఎదురవుతున్న పరిణామాలు షాక్ కు గురిచేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నది తన సన్నిహితుడు కేసీఆర్. ఇప్పటివరకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. అవసరమైనప్పుడు కేసీఆర్ హెల్ప్ తీసుకుంటున్నారు. తానూ హెల్ప్ చేస్తున్నారు. అటు కేంద్ర పెద్దలతో కూడా సఖ్యతగా మెలుగుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో షర్మిళ కామెంట్స్ మిగతా మిత్రులతో జగన్ కు ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టేలా ఉన్నాయని వైసీపీ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.

అసలు తెలంగాణలో వైఎస్సార్ టీపీ ఆవిర్భావమే జగన్ కు ఇష్టం లేదన్న వార్తలు వినిపించాయి. అటు జగన్ కు విభేదించి షర్మిళ పార్టీ పెట్టారన్న ప్రచారం ఉంది.అటు కుటుంబపరంగా చీలిక వచ్చిందని కూడా కామెంట్స్ వినిపించాయి. షర్మిళ పార్టీ పెట్టిన తరువాత వైసీపీ నేతలు సైతం దూరం జరిగిపోయారు. పార్టీ ఆవిర్భావ సభలో ఒకరిద్దరు వైసీపీ నేతలు తప్ప ఇతరులెవరూ కనిపించలేదు. షర్మిళ పాదయాత్రకు వైసీపీలో ఉన్న వైఎస్సార్ కుటుంబ అభిమానులు సంఘీభావం తెలిపినా వారందర్నీ జగన్ కట్టడి చేశారన్న ప్రచారం ఉంది. అటుషర్మిళ వ్యవహార శైలిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. ఏపీలో జగన్ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అప్రదిష్టపాలు చేసేందుకు దుష్ట చతుష్టయం ఉందని తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి రాధాకృష్ణకు షర్మిళ ఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి సంకేతం. అంతటితో ఆగకుండా జగన్ తో తనకు విభేదాలున్నాయని కూడా ఆమె బాహటంగా ఒప్పుకున్నారు. తనకు వారసత్వంగా రావాల్సిన ఆస్తిని సైతం ఇవ్వలేదని కూడా ఆమె చెప్పారు. జగన్ కష్టకాలంలో అండగా నిలిచిన తమను అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పడేశారని కూడా చెప్పుకొచ్చారు.
తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. హత్యకు గురైంది ఏపీ సీఎం జగన్ బాబాయ్. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు. పైగా హతుడు మాజీ ఎంపీ, మాజీ మంత్రి. ఏపీ ప్రభుత్వంపైనా.. అక్కడ వ్యవస్థలపైనా నమ్మకం లేక కుటుంబసభ్యులే కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాలని కోరడం కూడా జగన్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేసింది. ఈ కేసులో కూడా షర్మిళ బలంగా నిలబడినట్టు వార్తలు వస్తున్నాయి. బాబాయ్ హత్య విషయంలో షర్మిళ కీలక వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీతను వెనుక ఉండి నడిపిస్తోంది కూడా షర్మిళనేనని జగన్ అండ్ కో అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న తనను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనుక జగన్ ఒత్తిడి ఉందని అటు షర్మిళ కూడా అనుమానిస్తున్నారు. అందుకే షర్మిళ వ్యూహాత్మకంగా తన తల్లి విజయలక్ష్మిని తెరపైకి తెచ్చారు. తనకు మద్దతుగా నడి రోడ్డుపై కూర్చొబెట్టారు. సహజంగా ఇది జగన్ కు చికాకు పెడుతుందని ఆమె గ్రహించి ఈ చర్యలకు దిగారు.

మున్ముందు షర్మిళ జగన్ కు మరిన్ని చికాకు పెట్టే పరిణామాలకు తెరతీస్తారన్న టాక్ నడుస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపించే కొలదీ ఆమె చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఏపీలో పోటీచేయాలని ఇక్కడ క్రైస్తవ సోదరులు, వైఎస్సార్ అభిమానులు కోరుతున్నారని .. ఆ మధ్య షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ మీడియా ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అప్పట్లో అది అధికార పార్టీలో కలవరానికి కారణమైంది. మళ్లీ ఇప్పుడు షర్మిళ చర్యలు కూడా వైసీపీ శ్రేణులకు షాక్ కు గురిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ ఎంతగానో సహకరించారు. అటు కేంద్ర పెద్దలు కూడా పరోక్ష సహకారమందించారు. కానీ ఇప్పడు షర్మిళ అటు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతుండగా… తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే తమ ఓటమికి కేసీఆర్, జగన్ కలిసి షర్మిళను తెరపైకి తెచ్చారని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే షర్మిళను జగన్ బాహటంగా వ్యతిరేకించడం లేదు.. సమర్థించడం లేదు. అయితే రాజకీయంగా జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించిన తనను పలకరించేందుకు కూడా జగన్ ఇష్టపడకపోవడంపై షర్మిళ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే తల్లి విజయలక్ష్మితో కలిసి షాకులిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.