Venu Swamy: సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఏమాత్రం తొందరపాటు వ్యాఖ్యలు చేసినా.. అతిగా స్పందించినా.. అల్లరి పాలు కావడం తథ్యం. అందునా సోషల్ మీడియా స్టార్లు, దాని పేరిట నాలుగు డబ్బులు వెనుకేసుకోవాలని ప్రయత్నించేవారు చాలా జాగ్రత్తగా మెసులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మాట జారిన వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీల భవిష్యత్తును తన జ్యోతిష్యం ద్వారా చెప్పే వేణు స్వామి.. పవన్ కళ్యాణ్ విషయంలో నోరు జారి అడ్డంగా బుక్కయ్యారు.
ఈమధ్య పొలిటికల్ జ్యోతిష్యం, చిలక జోష్యాలు.. రాజకీయ వ్యూహంలో భాగమైపోయాయి. పొలిటికల్ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత ఇటువంటి వారి పాత్ర గణనీయంగా పెరిగింది. మొన్న మధ్యన ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన చిలక జోష్యుడితో వైసిపి మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. సోషల్ మీడియాలో ట్రోల్ నడిచాయి.
గత ఎన్నికల తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చింది. జనసేన కు దారుణ ఓటమి ఎదురయింది. అటువంటి సమయంలో జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయానికి పవన్ రాజకీయాలకు దూరమవుతారని చెప్పుకొచ్చారు. అసలు పవన్ అనే వ్యక్తి రాజకీయాల్లో మనుగడ సాధించలేరని సైతం తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల వ్యవధి లేదు. పవన్ చూస్తే పొలిటికల్ గా రాటుదేలారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అన్ని విధాలా సంసిద్ధులుగా ఉన్నారు. ఈ తరుణంలో వేణు స్వామి అప్పట్లో చేసిన కామెంట్స్.. ఇప్పుడు వైరల్ గా మారాయి. అటు వేణు స్వామి విశ్వసనీయతపై విమర్శలు తలెత్తాయి. ఓటర్ మైండ్ సెట్ మార్చే దానికి యూట్యూబ్ ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయని.. మరోసారి ఇటువంటి వీడియోలు పెడితే మర్యాద దక్కదన్న హెచ్చరికలు జన సైనికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.