Homeజాతీయ వార్తలుVemulawada Constituency: గ్రౌండ్‌ రిపోర్ట్‌ : బీఆర్ఎస్ లో కేసీఆర్ సన్నిహితుడికే చెక్..

Vemulawada Constituency: గ్రౌండ్‌ రిపోర్ట్‌ : బీఆర్ఎస్ లో కేసీఆర్ సన్నిహితుడికే చెక్..

Vemulawada Constituency: వేములవాడ.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆధ్యాత్మిక క్షేత్రం. పేదల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి కొలువు దీరిన పుణ్యక్షేత్రం. రాజకీయంగానూ వేములవాడ అత్యంత కీలకం. జనశక్తి ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ గడ్డే. పోరాటాల చరిత్ర వేములవాడకు ఉంది. సాయుధ రైతాంగ పోరాటంలోనూ చెన్నమనేని రాజేశ్వర్‌రావు లాంటి నేతలు కీలక పాత్ర పోషించారు. నాడు నేరెళ్ల నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేములవాడ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి, తెలంగాణలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు చెన్నమనేని రాజేశ్వర్‌రావు కొడుకు చెన్నమనేని రమేశ్‌బాబు గెలిచాడు. వెలమ సామాజికవర్గానికి చెందిన రమేశ్‌బాబుపై బీసీ నేత ఆది శ్రీనివాస్‌రావు అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు.

నియోజకవర్గ స్వరూపం..
ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు వేములవాడ, కోనారావుపేట, చందుర్తి, కథలాపూర్, మేడిపల్లి ఉన్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో రాజేశ్వర్‌రావు వారసుడిగా టీడీపి తరఫున రమేశ్‌బాబు పోటీచేసి విజయం సాధించాడు. ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి ఆది శ్రీనివాస్‌ బరిలో నిలిచాడు. 2010లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవికి రాజీనామా చేసిన రమేశ్‌బాబు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి మళ్లీ ఆదిశ్రీనివాస్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేశాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన ఆది శ్రీనివాస్‌ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై నిలబడ్డాడు. కానీ ఫలితం మారలేదు. 2018 ఎన్నికల్లో రమేశ్‌బాబు మళ్లీ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయగా, ఆది శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరి బరిలో నిలిచారు. ఫలితం మాత్రం మారలేదు.

పౌరసత్వ వివాదం..
2014 ఎన్నికల తర్వాతనే రమేశ్‌బాబు పౌరసత్వంపై వివాదం మొదలైంది. రమేశ్‌బాబుకు భారతీయ పౌరసత్వం లేదని, జర్మనీ పౌరుడిగా కొనసాగుతూ భారత ప్రభుత్వాన్ని మోసం చేసి భారతీయ సభ్యత్వం తీసుకున్నాడని ఆది శ్రీనివాస్‌ కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. 2018లో రమేశ్‌బాబుకు టికెట్‌ రాదని అంతా భావించినా కేసీఆర్‌ వెలమ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక పౌరసత్వం లేదని కేంద్రం కోర్టుకు నివేదిక కూడా ఇచ్చింది. కానీ రమేశ్‌బాబు వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. పౌరసత్వం లేదని నిర్ధారణ అయితే పదవి కోల్పోవాల్సి వస్తుంది.

సొంత పార్టీలోనే వ్యతిరేకత…
వేములవాడ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ తరఫున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేశ్‌బాబుకు గట్టి పోటీ ఉంది. జర్మన్‌ పౌరసత్వంపై రమేశ్‌ బాబు కోర్టుకెళ్లడంతో ఆయనకు అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అడ్డుకుందని పుకార్లు వ్యాపించడంతో ఆ సీటు అభ్యర్థులు వేములవాడ జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

చెల్మెడ లక్ష్మీనరసింహారావు పోటీ…
కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్‌ కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిఎఐఎంఎస్‌) తరపున వైద్య శిబిరాలు నిర్వహించి, మరో సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రభాకర్‌రావు సహకారంతో మల్లారం క్రాస్‌ రోడ్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, దేశంలోని ప్రతి జనాభాతో అనుసంధానం చేసే ప్రయత్నం చేశారు. పార్టీ అధిష్టానం అనుమతి ఇచ్చి పార్టీ టిక్కెట్‌ కేటాయిస్తే.. వేములవాడ ప్రాంత వాసులకు సేవ చేసేందుకు తాను పోటీ చేసేందుకు సిద్ధమని చెల్మెడ ప్రకటించారు.

మనోహర్‌రెడ్డి సైతం..
కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి మారి గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేశ్‌బాబు గెలుపులో కీలకపాత్ర పోషించిన ఏనుగు మనోహర్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం పోటీ పడి వేములవాడ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మనోహర్‌రెడ్డి గతంలో సెస్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేసినా పార్టీ అధిష్టానం తనకు ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. మనోహర్‌ తన మద్దతుదారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తూ వేములవాడకు ప్రాతినిధ్యం వహించే బీఆర్‌ఎస్‌ నామినేషన్‌ కోసం పోటీ పడుతున్నారు. ఒకవేళ పార్టీ తనకు టిక్కెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని మనోహర్‌ తన మద్దతుదారులకు తెలియజేశారు.

సొంత పార్టీలోనే త్రిముఖ పోటీ..
బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరికి ద్వితీయశ్రేణి నేతలు వివిధ వర్గాలుగా విడిపోయి తమ మద్దతును అందిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంపై ఎలా స్పందించాలో తెలియక ఆ పార్టీ క్యాడర్‌ ఉంది.

చెన్నమనేనికి కష్టమే..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎసష్‌ టికెట్‌ చెన్నమనేనికి వచ్చేది అనుమానంగానే ఉంది. ఇటీవల ఆయన మాట్లాడుతున్న తీరు ఇందుకు అద్దం పడుతోంది. మరోవైపు ఇటీవల వేములవాడకు వచ్చిన కేటీఆర్‌ చెల్మెడ లక్ష్మీనారాయణను వేదికపైకి ఆహ్వానించకపోవడాన్ని గమనించి ఆయనే స్వయంగా పిలిచారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ చెల్మడకే ఖాయం అని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నుంచి ఆది శ్రీనివాస్‌..
ఇక కాంగ్రెస్‌ నుంచి ఆది శ్రీనివాస్‌ ఈసారి కూడా పోటీ చేయడం ఖాయం. ఇప్పటికే నాలుగుసార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ ఈసారి ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈమేరకు ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

బీజేపీ నుంచి ముగ్గురు..
ఇక బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమతోపాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు కూడా పోటీకి ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోరు మాత్రం రసవత్తరంగా మారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular