Vangaveeti Radha Marriage
Vangaveeti Radha Marriage: వంగవీటి మోహన్ రంగ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. రాజకీయ రంగంలో బిజీగా ఉన్న ఆయన ఇన్నాళ్లు పెళ్లి ఆలోచన చేయలేదు. కానీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల సలహాను మన్నించి ఎట్టకేలకు 44 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వివాహ నిశ్చితార్థ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అక్టోబర్ 22న వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. నిశ్చితార్థ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు వంటి సన్నిహితుల సమక్షంలోనే వేడుకలు సాగాయి. వధువు జక్కంపూడి పుష్పవల్లి హైదరాబాదులో ఉన్నత చదువులు చదివారు. కొంతకాలం ఆమె యోగా టీచర్ గా పని చేశారు. ప్రస్తుతం నర్సాపురం లో ఓ విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు.
వారిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే. పుష్పవల్లి తల్లి అమ్మా ని మున్సిపల్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. తండ్రి బాబ్జి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండేవారు. కొంతకాలం పాటు రాజకీయాలను విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇటీవలే నరసాపురం చేరుకున్నారు. ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. వారాహి యాత్రలోపవన్ నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇక వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆ రెండు పార్టీలకు చెందిన నాయకుల కుటుంబాల మధ్య పెళ్లి కుదరడంతో… రెండు పార్టీలు వియ్యం అందినట్లు అవుతుంది.