
Vangaveeti Radha : వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు తెలుస్తుంది. ఆయన త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు పలు వాట్సాప్ గ్రూపుల్లోను, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త షేరింగ్ అవుతుంది. ఇప్పటికే ఆయన టీడీపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోను అంతగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించే పనిలో టీడీపీ నేతలు ఉన్నట్లుగా సమాచారం.
వంగవీటి రాధా గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో పనిచేశారు. ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ తోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జనసేనలో ఎప్పుడో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, టీడీపీ – జనసేన పొత్తు కోసం వేచి చూసినట్లు చెబుతున్నారు. ఇటీవల జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ విజయవాడలో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన 2019లో అధిష్టానంతో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఈ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించినా దక్కలేదు. అప్పటికే ఆశావహులకు సీటు కన్ఫర్మ్ అవడంతో, టీడీపీ అధిష్టానంపై పెద్దగా ఒత్తిడి పెంచలేదు. ఈ సారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు రాధా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
సన్నిహితుల నుంచి కూడా టీడీపీ వీడాలని ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీ ముఖ్య నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆయనకు కాస్త దగ్గరగా జరిగేందుకు ప్రయత్నించినా, సాధ్యపడలేదు. కాగా, టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వంగవీటి రాధా నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోందని చెప్పవచ్చు.