
హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాదీవెన యాత్ర చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు వేచి చూస్తున్నాయి. ఈటలను ఢీకొట్టే అభ్యర్థి కోసం నిరీక్షిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎన్నిక బరిలో దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడినే ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 61 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బదులిచ్చి నైతిక విజయం తమదేనని ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఓట్ల కోసం పాట్లు పడాల్సి వస్తోందని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ ను ఢీకొనాలంటే ఆయనకు సమ ఉజ్జీ అయిన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఓట్లు రాబట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు. నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం నేతను బరిలోకి దింపేందుకు ఆలోచిస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా ఆలోచనలో పడిపోయారు. అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికార పార్టీ, బీజేపీని ఎదుర్కొనే సత్తా గల నేత కోసం గాలిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు వేచి చూస్తున్నారు. అభ్యర్థి ప్రకటనతోనే పార్టీ ప్రచారం కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ బడా నేత కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును త్వరలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.