
పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. వయసు చూస్తే చిన్నతనమే. పనులు మాత్రం పెద్దవే. సీఎం కాన్వాయ్ అంటే అందరికి భయమే. అన్ని ఉన్నా పెద్దవారే సీఎం వాహన శ్రేణికి ఎదురెళ్లేందుకు జంకుతుంటారు. కానీ వారికి నిండా పదహారేళ్లు కూడా లేవు. పైగా సరైన మార్గం కాకుండా విరుద్ధమైన రహదారిలో ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. కాసేపే పోలీసులను సైతం నివ్వెరపరచారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. బాలురకు బైక్ లు ఇస్తూ వారిని చెడగొడుతున్న తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఎన్టీఆర్ మార్గ్ లో వెళ్లారు. ఆ సమయంలో 11,14 సంవత్సరాల వయసున్న బాలురు ఓ ద్విచక్ర వాహనంపై సీఎం వాహనానికి ఎదురెళ్లారు. దీంతో పోలీసులు హైరానా పడ్డారు. అప్రమత్తమై వారిని వెంబడించి బైక్ ను అదుపులోకి తీసుకున్నారు. తీరా విచారిస్తే వారి బైక్ కూడా కొట్టుకొచ్చిందని తేలడంతో ఆశ్చర్య పోయారు. ఎవరో వారికి బైక్ ను రూ. 2 వేలకు విక్రయించారు. దీంతో వారు బైక్ పై చెలరేగిపోయారు. సీఎం కాన్వాయ్ కే ఎదురెళ్లి పోలీసులకు చిక్కారు.
వారిలో ఒకరిది శాస్రిపురం కాగా మరొకరిది నీలోఫర్ ప్రాంతం. బైక్ చవకగా వస్తుందన్న ఆశతో రెండు వేలకు కొనుగోలు చేసి తరువాత నక్లెస్ రోడ్డులో నిబంధనలకు విరుద్దంగా వాహనం నడిపి పోలీసులకు దొరికారు. సదరు బైక్ చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. చిన్నారులకు బైక్ ఇస్తూ వారిని పాడు చేస్తున్న తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కానీ ఆ బాలురు వాటిని లెక్కచేయలేదు. బైక్ ఉందనే దీమాతో వాహనాలకు ఎదురెళ్లారు. సాధారణంగా సీఎం వెళ్లే మార్గంలో రోడ్డంతా పోలీసుల కంట్రోల్ లో ఉంటుంది. అలాంటిది బాలురు వాటిని ఏం ఖాతరు చేయకుండా ఎదురెళ్లడం విమర్శలకు తావిస్తోంది. పెద్దవారు ట్రాఫిక్ ఆంక్షలు అనిక్రమించే సమయంలో జాగ్రత్తగాఉంటారు. కానీ వారు ఏ జాగ్రత్తలు తీసుకోకుండానే యథేచ్ఛగా వెళ్లారు. దీంతో పోలీసులు సైతం ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో అని తేరుకునే లోపే వారిని అదుపులోకి తీసుకుని బైక్ స్వాధీనం చేసుకున్నారు.