
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమితులైన సభ్యుల వ్యక్తిగత సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంబో కార్యవర్గం ప్రకటించి వివాదాల్లో పడిపోతోంది. సభ్యుల్లో చాలా మంది నేరచరితులు ఉన్నట్లు సమాచారం. దీంతో టీటీడీ పదవి పొందినందుకు వారి భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిఫారసు లేఖతో ఓ వ్యక్తి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు సమాచారం. దీనికి కిషన్ రెడ్డి స్పందిస్తూ తాను ఎవరికి లేఖ ఇవ్వలేదని చెప్పినట్లు తెలిసింది. దీంతో నకిలీ లేఖ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం కూడా ఇంత మందితో బోర్డు ఏర్పాటు చేయడం వివాదాలకు తావిస్తోంది. ఎన్నడు లేని విధంగా 75 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఆ నకిలీ లేఖపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. టీటీడీ బోర్డులో పదవి కోసం అడ్డదారులు తొక్కడం వివాదాస్పదమవుతోంది. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పలు పొరపాట్లు దొర్లినట్లు తెలుస్తోంది. టీటీడీ తీరుపై కూడా ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.
బోర్డు కమిటీలో ముక్కు ముఖం తెలియని వారు కూడా చోటు దక్కించుకున్నట్లు సమాచారం. సభ్యుల్లో చాలా మందిపై కేసులు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శ్రీవారి పాలకమండలికి ఇంత పెద్ద మొత్తంలో సభ్యులను నియమించడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. చివరికి నకిలీ లెటర్లతో కూడా పదవులు సంపాదించుకోవడం చూస్తుంటే దేవుడిపై భక్తి కంటే తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని తెలిసిపోతోంది.
ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి నియమించబడిన కన్నయ్య అనే వ్యక్తిపై సీబీఐ కేసులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధం లేకుండా పలు కేసుల్లో నిందితులను సభ్యులుగా నియమించడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ తీరుతో నిరసన పెరుగుతోంది. ప్రభుత్వం ఇలా నిబంధనలు పాటించకుండా నేరస్తులకు పదవులు కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.