
ఒక వేలితో ఎదుటివారిని చూపించే ముందు మిగతా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విమర్శించడం సులువే. కానీ మన దుకాణమే సరిగా లేకుండా ఎదుటివారిని విమర్శించినప్పుడే నవ్వుల పాలు అవుతాం. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి అలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా విషయంలో తెలంగాణ నిర్లక్ష్యం వహిస్తోందని.. చేతులు ఎత్తేసిందని విమర్శించాడు. దీనికి గులాబీ శ్రేణులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. మరి తెలంగాణలో వదిలేద్దామని.. దేశంలో మోడీ ప్రభుత్వం ఏం వెలగబెడుతోందని ప్రశ్నిస్తున్నారు.. పోనీ బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో కరోనా కంట్రోల్ అయ్యిందా అంటే దారుణంగా ఉందంటున్నారు. ముందు తన దుకాణమే బాగా లేకున్నా తెలంగాణలో కరోనా నియంత్రణ లేదని ఆరోపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన విమర్శలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బాగానే కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ చిల్లర మాటలు మాట్లాడుతోందని.. కరోనా అనేది ప్రపంచ సమస్య అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో కరోనా కట్టడి లేదనడం నవ్వుల పాలవుతోందన్నారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోండని హితవు పలికారు. గుజరాత్ లో కరోనాతో ఎంతమంది చనిపోయారు? గుజరాత్ లో ప్రభుత్వం విఫలమైందా? గుజరాత్ నుంచి ప్రధాని బాధ్యత వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మర్కజ్ ఢిల్లీ ప్రార్థనలు ప్రధాని ఉండే పక్కనే జరిగినా మీరు ఏం పట్టించుకోలేదని విమర్శించారు.
బీజేపీ జాతీయ నాయకులు స్థానిక తెలంగాణ నేతల ప్రోద్భలంతో మాట్లాడుతున్న మాటలకు కేసీఆర్ సహా ఈటలలు పలు సందర్భాల్లో గట్టి వార్నింగ్ లే ఇస్తున్నారు. తెలంగాణలో ఆదాయ వ్యయాలపై ఆ మధ్య కేసీఆర్ ఏకంగా హోంమంత్రి అమిత్ షాకే లెక్కలు చెప్పి ఆయనవి దొంగ లెక్కలు అని నిరూపించడం జాతీయ స్థాయిలో అమిత్ షా పరువును గంగలో కలిపింది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఈటల కూడా కౌంటర్ ఇవ్వడం బీజేపీకి పోటులా మారింది.
ఏ ఎండకా గొడుగు పడుతున్న బీజేపీ నాయకుల విమర్శలు ఏ రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దేశానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు ఒకటి గుర్తు పెట్టుకుంటే మంచిందని నేతలు హితవు పలుకుతున్నారు. దేశమే వారి చేతుల్లో ఉంది. దేశంలో జెట్ స్పీడులా కేసులు పెరుగుతున్నాయి. అది కంట్రోల్ చేయలేక తెలంగాణపై ఏడిస్తే ఎలా అని ఈటల సహా టీఆర్ఎస్ నేతలు బీజేపీ తీరును ఎండగడుతున్నారు.