TRS vs BJP: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ దర్యాప్తు సంస్థలతో రాజకీయాలు చేస్తున్నాయి.. ‘నీకు ఈడీ ఉంటే.. నాకు సిట్ ఉంది.. నువ్వు లిక్కర్ స్కాం తవ్వితే.. నేను ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తవ్వుతా.. నువ్వు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తవ్వితే.. నేను లిక్కర్ స్కాంతోపాటు క్యాసినో లింకులు బయట పెడతా’ అన్నట్లుగా టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా కౌంటర్ పాలిటిక్స్‌కు దిగుతున్నాయి. దీంతో రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ప్రతీకా రాజకీయాలు ఎవరి కొంప ముంచుతాయో అని రెండు పార్టీల నేతల్లో అందోళన కనిపిస్తోంది.

సిట్, ఈడీ దూకుడు..
తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా బీజేపీ అగ్రనాయకులే లక్ష్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలో సిట్ విచారణ సాగుతోంది. సీవీ.ఆనంద్ నేతృత్వంలో దూకుడు ప్రదర్శిస్తోంది. జాతీయ స్థాయిలో తానేంటో నిరూపించుకునేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వాని టచ్ చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు చెక్ పెట్టాలని బీజేపీ ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈడీతో దూకుడు మీద ఉన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యాసినో కేసును తవ్వుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మంత్రి తలసాని బ్రదర్స్‌ను విచారించిన ఈడీ ఇప్పుడు తలసాని పీఏ హరీష్‌ను విచారించనుంది. హరీష్ బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ అధికారుల ముందుకు వచ్చినట్లు తెలిసింది. మొన్న తలసాని బ్రదర్స్, ఇప్పుడు తలసాని పీఏ విచారణతో అటు తలసానికి ఉచ్చు బిగుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
సిట్ విచారణకు దూరంగా ముగ్గురు..
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరుపుతున్న సిట్.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్‌తోపాటు కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామితోపాటు బీజేపీ అగ్రనేత బీఎస్.సంతోష్‌కు నోటీçసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. కానీ శ్రీనివాస్ ఒక్కరే విచారణకు వచ్చారు. మిగతా ముగ్గురు హాజరు కాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్నట్లు అరెస్ట్ చేయాలనే ఆలోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలానుసారం సాగుతున్న సిట్ విచారణను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేంద్రం.. కేసీఆర్ చెక్‌పెట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది.

క్యాసినో కేసు దర్యాప్తుతో..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు క్యాసినో కేసులో ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న ఈడీ తాజాగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మంత్రి తలసాని బ్రదర్స్‌ను విచారించిన ఈడీ ఇప్పుడు తలసాని పీఏ హరీష్‌ను విచారించి మంత్రిని ఇందులలోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కాంలోనూ కేసీఆర్ కూతురు కవితకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు అన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందులో ఓ ఎన్‌ఆర్‌ఐ పేరు బయటకు రావడం ఆయనతో కవిత ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం ఇందుకు నిదర్శనం. తాజాగా తెలంగాణ జాగృతికి చెందిన కొంతమందిని కూడా ఈడీ విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా సిట్, ఈడీ దూకుడు ఎవరి కొంప ముంచుతాయో అని అటు టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇటు బీజేపీ జాతీయ నేతలు ఆందోళన చెందుతున్నారు.