TRS Leader Tammineni Krishnaiah: అది మొదటి నుంచి ఎర్రనేల. తమ్మినేని సుబ్బయ్య అనే గొప్ప ఉద్యమకారుడు నడయాడిన నేల. ఆయన తన చేతులతో దళాలకు బువ్వ పెట్టి ఆదుకున్నాడు. ప్రజలను హింసిస్తున్న ఓ ముస్లిం జమిందార్ ను తన సాయుధ దళాలతో తరిమేశాడు. తమ్మినేని సుబ్బయ్య వీరోచితం గురించి ఏకంగా పుచ్చలపల్లి సుందరయ్య కూడా తన పుస్తకాల్లో మరింత గర్వంగా రాశాడు. తమ్మినేని సుబ్బయ్య కాలం నుంచే తెల్దారుపల్లిలో జనతా ప్రజాస్వామిక విప్లవానికి పునాదులు ఏర్పడ్డాయి. “బీటీ రణదేవే” పేరుతో ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కూడా నిర్మితమైంది. ఊరు చిన్నదే. కానీ హైవే పక్కన ఉండడంతో పెద్దదయింది. సిమెంట్ రోడ్లు, నల్లా నీళ్లు, గుడి, బడి తో కులరహితంగా బతుకుతోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కుత్తుకలను కోసే కత్తులు లిఖించే రక్త చరిత్ర. రాయలసీమకు మించిన గొడవలు, దాడులు, నరికివేతలు, పసుపు కుంకుమ పోగొట్టుకున్న మహిళల వెతలు సాధారణం. నిన్న జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్య మిగతా తెలంగాణ సమాజానికి పాశవికం. కానీ అక్కడివారికి మాత్రం సాధారణం. ఎన్నో హత్యలు చూసిన వారికి, నెత్తుటి మడుగులో కుప్పకూలిన దేహాలను చూసిన వారికి కృష్ణయ్య హత్య పెద్ద లెక్క కాదు. ఈ ఒక్క హత్యతో ఈ నెత్తుటి చరిత్ర ముగిసేది కాదు. పదునైన రాయి వచ్చి విలాసవంతమైన ఇంటిముందు పార్క్ చేసిన బెంట్లీ కారు అద్దాలను పగలగొట్టింది. న్యూటన్ మూడోగమన నియమ ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అది ప్రకృతి నిబంధన కూడా.. అలాగని కన్నుమూసిన తమ్మినేని కృష్ణ ఏం సుద్దపూస కాదు. రెండు పదుల కాలానికి ముందే పసుపు పార్టీ కార్యకర్త కాళ్లను అడ్డంగా నరికేసి అప్పుడు ఆయన మోస్తున్న ఎర్రజెండాను మరింత ఎర్రగా చేశాడు. అది ఒక భయానకం. బీభత్సం. నిన్న తెల్దారుపల్లి లో జరిగిన హత్య గత ప్రతీకారానికి నెత్తుటి సంతకం. ఇది ఇప్పటి తో ముగిసేది కాదు.

ఎర్రజెండా ఇక్కడొక నయా ఫ్యూడలిస్ట్
ఖమ్మం అంటేనే వామపక్ష ఉద్యమాలకు పెట్టింది పేరు. కొన్ని తరాలు అంతరించాక తమ్మినేని వీరభద్రం అనే వ్యక్తి తెల్లారుపల్లి నుంచి వ్యక్తి వామపక్ష పార్టీలో ఎదిగాడు. శక్తిగా మారాడు. ఈ ప్రయాణంలో తన పథానికి అడ్డు వచ్చే పాదాలను తన పాదాలతో తొక్కేశాడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడయ్యాడు. లేస్తే సమసమానత్వం, స్వేచ్ఛాయుత్వం, ప్రగతి శీల సమాజం అంటూ పెద్ద పెట్టున నినాదాలు ఇచ్చే వీరభద్రం.. తన సొంత ఊర్లో మాత్రం తన జెండా మాత్రమే ఎగరాలి అనుకున్నాడు. అందుకే ఇతర జెండాలను పాతాళం అడుగున తొక్కేశాడు. అధికారం కోసం ముందుచూపుతో పార్టీకి ఒక పేపర్ ఉండాలని, చానల్ కూడా ఉండాలని ఆలోచించాడు. వామపక్ష పార్టీలో ప్రజలే ప్రభువులు కాబట్టి ఆ ప్రజలే తలా ఇంత చందాలు వేసుకొని పేపర్ కు, చానల్ కు డబ్బులు ఇచ్చారు. ఈ మాయదారి పెట్టుబడిదారి సమాజంలో ప్రజా ప్రయోజన ఆలోచన ఒక విఫల ప్రయోగం అని భావించి మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాదరావు ఆస్తుల్లో తాను వసూలు చేసిన ప్రజాధనాన్ని తమ్మినేని వీరభద్రం అవనతం చేశాడు. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత తెల్దారుపల్లి లో ఎన్నికలు జరిగాయి.
Also Read: Visakhapatnam: సాగర నగరంలో సీరియల్ కిల్లర్..వారం రోజుల్లో ఒకే తరహాలో మూడు హత్యలు
ఎప్పుడో తాతల కాలంలో ఓటు వేసిన ఆ గ్రామ ప్రజలు.. ఈసారి మరింత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా ఈసారి అక్కడ ఎర్రజెండాకు బదులు ఇంటి పార్టీ నీడ అయిన ఇండిపెండెంట్ కాలర్ ఎగిరింది. అది కూడా 600 ఓట్ల మెజార్టీతో. ఈ దెబ్బతో అక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది అని చాలామంది అన్నారు. కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కాబట్టి వారే గెలిచారు. వారు పోలింగ్ బూత్ కి వెళ్లి ఓట్లు వేసి గెలిపించిన తమ్మినేని మంగతాయారు భర్త తమ్మినేని కృష్ణయ్య అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అంటే ప్రజలు వేసిన ఓటు ఇక్కడ నెత్తుటి మడుగులో తడిసిపోయింది. హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య ఒకప్పుడు తమ్మినేని వీరభద్రం అనుచరుడే. స్వయానా ఆయన బాబాయ్ కొడుకే. రాజకీయాల్లో బంధు ప్రీతులు ఉంటాయి కానీ.. అవసరం తీరితే ఎవరి చేతులను అయినా నరికేస్తాయి. అది బాబాయ్ కావచ్చు. బాబాయ్ అబ్బాయి కావచ్చు.

ఎవరన్నారు వారు పోరాటాలు చేస్తారని
కృష్ణయ్య హత్య తర్వాత ఆయన వర్గం వారు తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న వస్తువుల్ని ఎక్కడికక్కడ పగలగొట్టారు. అతడికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలో యంత్రాలను తగుల పెట్టారు. ఏ మాటకు ఆ మాట ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ముస్లిం జమీందారు పాలించేవాడు. అప్పట్లో అతడికి పెద్దపెద్ద భవంతులు ఉండేవి. వందల ఎకరాల భూములు ఉండేవి. పని చేసేందుకు పాలె గాళ్లు, పడక సుఖాన్ని ఇచ్చేందుకు బయటి మహిళలు ఉండే వారు. కానీ తమ్మినేని కృష్ణయ్య భవంతులను చూస్తే ఆ తురక జమిందార్ ఇళ్ళు పునాది రాళ్లకు కూడా సరిపోవు. రోడ్డు పక్కన ఉండే ఒక మారుమూల గ్రామంలో బెంట్లీ కారు వచ్చి వాలిదంటే అక్కడి వామపక్ష పార్టీ ఎంత లగ్జరీనో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళ పద ఘట్టనల తర్వాత ఆ విశాల భవంతులకు వెనుక వైపు ఉన్న ఒక వాడలో ఒక గోడకు ఆనుకొని ఉన్న రాళ్ల సమూహం లో చలనం వచ్చింది. ఏకంగా బెంట్లీ కారు అద్దాలను పగలగొట్టింది. బీఎండబ్ల్యూ రాజరికాన్ని తుక్కు తుక్కు చేసింది. ఒకప్పుడు తురక జమీందారును వెళ్ళగొట్టిన ఆ నేల ఇవ్వాలా మళ్లీ అదే పౌరుషాన్ని నింపుకుంది. ఎందుకంటే పోరాటం ఆ నేలకు ఎప్పుడూ కొత్త కాదు. ప్రతీకారానికి నిలువెత్తు నెత్తుటి సంతకం.