Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు ప్రధానమైనవి. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గుంటూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలను దాదాపు స్వీప్ చేస్తామన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ రెండు జిల్లాల్లో యువనేత నారా లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని లోకేష్ యాత్రకు ముఖం చాటేయడం హాట్ టాపిక్ గా మారింది.
గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గెలిచిన ఎంపీలు ఇద్దరు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. గెలిచిన తర్వాత పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉండే గల్లా జయదేవ్, కేశినేని నాని ఇటీవల కనిపించడం మానేశారు. అటు లోకేష్ పాదయాత్రను సైతం ఇద్దరు నేతలు లైట్ తీసుకుంటున్నారు. లోకేష్ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని ఎల్లో మీడియా పెద్దగా ప్రచారం చేస్తోంది. కానీ ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు గైర్హాజరవుతుండడాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. ఇద్దరు ఎంపీలు కనిపించకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. పార్టీ నాయకత్వంపై బాహటంగానే ఆయన విమర్శలకు దిగుతున్నారు. చెత్త నాయకులకు లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని కేశినేని నాని తరచూ కామెంట్స్ చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమాలకు లోకేష్ అండదండలు ఉన్నాయని.. పైగా తనపై తన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రయోగిస్తున్నారని నాని ఆగ్రహంగా ఉన్నారు. అందుకే లోకేష్ యాత్రకు తాను వెళ్లడం లేదని అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారు.
అటు గల్లా జయదేవ్ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేశినేని నాని మాదిరిగా ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం లేదు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన చాలా యాక్టివ్ గా పని చేశారు. అమరావతి కి మద్దతుగా లోక్సభలో బలమైన వాయిస్ ని వినిపించారు. జగన్ సర్కార్ అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ పై అణచివేత ప్రారంభించిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ ను తగ్గించారు. ఆయన వైసీపీలో చేరుతారని.. ప్రో వైసిపి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ గల్లా కుటుంబం టిడిపిలోనే యాక్టివ్ గా ఉంది. జయదేవ్ తల్లి అరుణకుమారి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయినా సరే జయదేవ్ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.