
Avinash Reddy Arrest: వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం వైసీపీని బాగానే కుదిపేస్తుంది. సొంత బాబాయ్ హత్య విషయం జగన్ కు తెలుసని, నిందితులను తప్పించేందుకు సహకరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. తదనంతరం జరుగుతున్న పరిణామాలతో కంచుకోటగా పేరుపొందిన సొంత జిల్లాలోను పరువు పొగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా టీడీపీ ఇక్కడ బలం పుంజుకోవడమే ఇందుకు ఉదాహరణ. మరికొద్ది రోజుల్లో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పేలా లేదు. ఆ తరువాత జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది.
సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు వివేకా కేసు విచారణ క్రియాశీలకంగా మారడం జగన్ కు మింగుడుపడటం లేదు. నాలుగేళ్ల విచారణ తరువాత సీబీఐ పలువురు కీలక నిందితులను అరెస్టు చేసింది. వారంతా జగన్ కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు. ఈ పరిణామంతో జగన్ ఆత్మరక్షణలో పడిపోయారు. హత్యకు గురైంది చిన్నాన్న, అరెస్టు అయ్యింది, కాబోతుంది కూడా మరో సొంత చిన్నాన్న భాస్కర్ రెడ్డి, తమ్ముడు అవినాష్ రెడ్డి. ఎటు నుంచి చూసినా ఆ ప్రభావం జగన్ పై స్పష్టంగా పడుతుంది. బాబాయ్ హత్య కేసు విచారణ కంటే, నిందితులుగా ఉన్న కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేయడంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నిన్నా మొన్నటి వరకు కడపలో వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పిందే నడిచింది. ప్రస్తుతం కూడా జరుగుతున్నా, అంతకు ముందున్న పరిస్థితులు లేవు. రాయలసీమలో ఎన్ని గ్రూపులు ఉన్నా వారందరినీ వైఎస్ కుటుంబమే శాసిస్తూ వస్తోంది. ఎవరిని ఏమన్నా, వాళ్లంతా ఒక గ్రూపు అనుకొని ఎవరికి వారు కిక్కురుమనకుండా చెప్పింది చేసేవారు. వివేకా హత్య అనంతరం వైఎస్ కుటుంబాల్లో వివాదాలు బయటపడ్డాయి. హత్యలు చేసుకునేంత పగలు ఉన్నాయని తేలిపోయింది. ప్రజలు వ్యతిరేకత మొదలైంది. బయటపడకపోయినా గుంభనంగా ఉంది. అప్పటి వరకు భయపడుతూ ఉన్న వాళ్లందరూ అడ్డం తిరగడం మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది.

మొత్తమ్మీద రాయలసీమలో టీడీపీ హవా కనిపిస్తోంది. నెలన్నర క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బాగా పుంజుకుంది. వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న పులివెందులలో సైతం టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలో రెండే రెండు నియోజకవర్గాలు ఆ పార్టీకి దక్కాయి. ప్రస్తుతం జరుగుతున్న తీరును బట్టి మొత్తం క్వీన్ స్విప్ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి ఇంతలా ప్రజాదరణ పెరగడానికి వైసీపీ నేతల స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణం. ఒకవైపు వివేకా హత్య కేసు అభాండాలను మోయలేక, మరోవైపు ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేని స్థితిలో జగన్ నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు.