Palamuru Rangareddy Project: ఇదీ కెసిఆర్ సర్కారు దాస్తున్న “పాలమూరు” అసలు నిజం

ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పాలమూరు రంగారెడ్డి పథకంలో ఒక్క మోటర్ మాత్రమే వెట్ రన్ కు రెడీ గా ఉంది. మరి ఈ ఒక్క మోటార్ తోనే పాలమూరు పచ్చబడుతుందా? ఈ విషయాన్ని చెప్పడంలో భారత రాష్ట్ర సమితి నాయకులు చాలా గోప్యత పాటిస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : September 16, 2023 3:46 pm

Palamuru Rangareddy Project

Follow us on

Palamuru Rangareddy Project: పాలమూరు ప్రజలు కృష్ణానది నీళ్లు చూడనట్టు.. అసలు ఆ ప్రాంతంలో పంటలే పండనట్టు.. సహారా ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్టు.. ప్రచారం చేసుకుంటుంది భారత రాష్ట్ర సమితి. వాస్తవానికి మన రాష్ట్రంలో కృష్ణ నది జలాలు అడుగుపెట్టేదే పాలమూరు జిల్లాలో.. నాణ్యమైన వేరుశనగ, అద్భుతమైన కందులు, బలిష్టంగా ఉండే జీవాలు, అబ్బురపరిచే ఆముదాలు.. పాలమూరు జిల్లాలో పండుతాయి. మరి ఇవన్నీ నీళ్ళు లేకుండానే పండాయా? ఎన్నికలు ముందు ఉన్నాయి కాబట్టి.. ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవాలి కాబట్టి.. భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ సరికొత్త ప్రచారానికి తెరదీశారు. పాలమూరు_ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తూ.. నదికి నడకలు నేర్పించినట్టు చెబుతున్నారు. నమస్తే తెలంగాణ, ఇంకా అధికార పార్టీ భజన చేసే మీడియా అసలు విషయాలను వెలుగులోకి తీసుకు రాకపోవచ్చు. కానీ వాస్తవాలు ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉంటాయి.

ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పాలమూరు రంగారెడ్డి పథకంలో ఒక్క మోటర్ మాత్రమే వెట్ రన్ కు రెడీ గా ఉంది. మరి ఈ ఒక్క మోటార్ తోనే పాలమూరు పచ్చబడుతుందా? ఈ విషయాన్ని చెప్పడంలో భారత రాష్ట్ర సమితి నాయకులు చాలా గోప్యత పాటిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి విషయాన్ని పక్కన పెడితే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 5.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు పూర్తికాక కేవలం 3.69 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. రాజీవ్ బీమా కింద 1.98 లక్షల ఎకరాలకు గానూ 1.66 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. ఇక జవహర్ నెట్టెంపాడు కింద రెండు లక్షల ఎకరాలకు గానూ 1.42 లక్షల ఎకరాలపై సాగునీరు అందుతున్నది. కోయిల్ సాగర్ కింద 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా 35 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది.

ప్రాజెక్టుల విషయంలో గొప్పగా చెప్పిన ప్రభుత్వం నిర్వాసితుల విషయానికి వచ్చేసరికి మాట దాటవేస్తోంది. ” కృష్ణమ్మ జలాలతో పాలమూరు పాదాలు కడుగుతా. హరిహర బ్రహ్మాదులు ఎదురైనా, ఆరు నూరైనా, పాలమూరు_ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. ముంపునకు గురవుతున్న కుటుంబాల్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం. వారి కడుపునింపిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం. నిర్వాసితుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఎక్కువ. వారు సర్కార్ జీతం తీసుకున్న తర్వాత పనులు ప్రారంభిస్తాం. నిర్వాసితులకు 5.4 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తాం” ఇదీ 2015 11న పాలమూరు రంగారెడ్డి పథకానికి మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన వద్ద శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ. అయితే 8 సంవత్సరాలయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులకు న్యాయం జరగలేదు. ఉద్యోగాలు ఇస్తామని, ప్రాజెక్టు కింద భూములు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ అమలు కాలేదు.. తమ భూములు గుంజుకుని, తమ ఇళ్లను ముంచి రోడ్డుపాలు చేశారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ పథకం మొత్తంలో 20 ఆవాసాలు మునిగిపోయి, 2,386 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నాయి. ఇందులో కరివెన రిజర్వాయర్ కింద నిర్వాసితులైన మూడు తండాలకు సంబంధించి భట్టుపల్లి పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించారు. మిగిలిన నార్లాపూర్, వట్టెం, ఏదుల, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద నిర్వాసితులయ్యే 17 ఆవాసాల వారికి ఇప్పటివరకు ప్యాకేజీ ప్రకటించారు తప్ప ఆర్ అండ్ ఆర్ కేంద్రాలలో ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టలేదు. నిర్వాసితులందరికీ గంపగుత్తగా డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు కలుపుకొని 12.50 ప్యాకేజీని, ఆర్ అండ్ ఆర్ సెంటర్లలో 250 చదరపు గల స్థలాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే.. ఉదండ పూర్ లాంటి ప్రాంతాలలో నిర్వాసితులు దాన్ని అంగీకరించడం లేదు. ప్రభుత్వం ప్యాకేజీకి నిర్వాసితులు అంగీకరించిన చోట్ల కూడా ఏలు గడుస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాథమికంగా 35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఆ తర్వాత పథకం రూపకల్పనలో జరిగిన మార్పులు, చేర్పులతో అంచనా వ్యయం 52,000 వేల కోట్లకు పెరిగింది. ఏడు ఏళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం నికరంగా 15,412 కోట్లు చేసింది. ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 1,187.64 కోట్లు కేటాయించింది.